Botsa Satyanarayana: ఏపీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో జంపింగ్ జపాంగులు ప్రారంభమయ్యాయి. నేతలు సేఫ్ జోన్ ఎంచుకుంటున్నారు. సొంత పార్టీలో టిక్కెట్ దక్కదన్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే కీలక నాయకులు సైతం పార్టీ మారేందుకు సిద్ధపడుతుండడం విశేషం. ఏకంగా ఏపీలో సీనియర్ నాయకుడిగా పేరొందిన బొత్స కుటుంబం నుంచి కొంతమంది నేతలు టిడిపిలోకి వస్తున్నారన్న వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
వచ్చే ఉగాది నాటికి ఏపీలో తెలుగుదేశం, జనసేన లు ఉండవని మంత్రి బొత్స సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అదే జరగకుంటే తాను గుండు గీసుకుంటానని బొత్స చాలెంజ్ చేశారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన టిడిపి నేత బోండా ఉమ బొత్స కుటుంబం నుంచి కొంతమంది తమకు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే ఇదంతా వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు అంతా అనుమానించారు. కానీ బొత్స కుటుంబానికి చెందిన ఓ ఎమ్మెల్యే టిడిపి నేతలతో చర్చలు జరిపారన్న విషయం తాజాగా బయటపడింది.
నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు మంత్రి బొత్స కు సమీప బంధువు. వరుసకు సోదరుడు అవుతాడు. స్వయానా మేనకోడలి భర్త ఆయన.2009 ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలుపొందారు.అయితే ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. వారం రోజులు పాటు బెంగళూరు టూర్ కి వెళ్లిన ఆయన.. అక్కడ టిడిపి నేతలతో మంతనాలు చేశారని టాక్ నడుస్తోంది. బొత్స తో తలెత్తిన విభేదాలే అందుకు కారణంగా తెలుస్తోంది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బడ్డుకొండ అప్పలనాయుడు క్యాబినెట్ బెర్త్ ఆశించారు. మంత్రి బొత్స ని పక్కన పెడితే సామాజిక వర్గ సమీకరణలో తనకు అవకాశం కల్పించాలని బొడ్డుకొండ బాహటంగానే కోరారు. ఇది మంత్రి బొత్సకు మింగుడు పడటం లేదు. అందుకే నెల్లిమర్ల నియోజకవర్గం లో బొడ్డుకొండకు వ్యతిరేకంగా తన సోదరుడు లక్ష్మణరావును బొత్స రంగంలో దించారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎమ్మెల్యే బొడ్డుకొండకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని రూపొందించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పావులు కదిపారు. కొన్ని సర్పంచ్ స్థానాలను మంత్రి బొత్స వర్గీయులు దక్కించుకున్నారు. అప్పటినుంచి రెండు వర్గాల మధ్య గట్టి ఫైట్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని మంత్రి బొత్స సోదరుడు లక్ష్మణరావు ప్రచారం చేసుకుంటున్నారు. అటు ఐప్యాక్ సర్వేలో సైతం బొడ్డుకొండపై ప్రతికూల నివేదిక అధిష్టానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో టిక్కెట్ దక్కదన్న నిర్ణయానికి వచ్చిన బొడ్డుకొండ టిడిపికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బొత్స, బొడ్డుకొండ కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. మొన్న ఆ మధ్యన బొడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహానికి బొత్స కుటుంబం గైర్హాజరైనట్లు తెలుస్తోంది. జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు కుమార్తెనే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. మధ్య శ్రీనివాసరావు స్వయానా బొత్సకు మేనల్లుడు. అయినా సరే కుటుంబంలో తలెత్తిన వివాదాలతో ఇరు కుటుంబాల మధ్య చాలా గ్యాప్ పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి బొడ్డుకొండను తెంపేయాలన్న ప్రయత్నంలో బొత్స అండ్ కో ఉంది. ఇది గమనించిన బొడ్డు కొండ అప్పలనాయుడు టిడిపికి టచ్ లోకి వెళ్లారు. బెంగళూరులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తో కీలక చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఇది బొడ్డుకొండతో ఆగుతుందా? అదే బాటలో ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.