Revanth Reddy: తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అంతకుముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.ఓ మాతృమూర్తి వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. ప్రేమగా దగ్గర తీసుకొని తలపై ముద్దు పెట్టారు.ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీఎల్పీ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ హై కమాండ్ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ను సీఎంగా ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా రేవంత్ ను తన ఇంటికి ఆహ్వానించారు. అక్కడికి వెళ్లిన రేవంత్ కు దీపేందర్ తల్లి ఆశా హుడా ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆమె పాదాలకు రేవంత్ నమస్కరించారు. ఆశా ఆయనకు విజయ తిలకం దిద్దారు. ప్రేమగా దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెట్టారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ x లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
కాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి రేవంత్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, సుదర్శన రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ చేరుకున్న రేవంత్ కు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బిజెపి రవి గుప్త, హైదరాబాద్ సిటీ కమిషనర్ సందీప్ శాండిల్యా రేవంత్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సరిగ్గా మధ్యాహ్నం 1:04 గంటలకు సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు లక్ష మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 గ్యారంటీల పథకంపై రేవంత్ తొలి సంతకం చేయనున్నారు. అయితే రేవంత్ తో పాటు కేవలం ఎనిమిది మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే హై కమాండ్ మాత్రం పూర్తిస్థాయిలో మంత్రివర్గం జాబితాను విడుదల చేసి ప్రమాణస్వీకారం చేయించాలని సూచించినట్లు సమాచారం.
డిలీల్లోని దీపేందర్ ఎస్ హుడా ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #revanthreddy #congress #telangana #revanthsainyamtelangana pic.twitter.com/gTuJi7fQhx
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) December 6, 2023