Credit Card : గత 10 పదేళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్యస్థ వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా నైపుణ్యాభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, రుణాల కోసం ముద్ర వంటి పథకాల నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రకటించారు. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థల కోసం రూ. 5 లక్షల పరిమితితో ప్రత్యేక కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డును ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. మొదటి సంవత్సరంలో 10లక్షల కార్డులు జారీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
2025 కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన హామీ ప్రకారం.. సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులకు (మైక్రో ఎంట్రాప్రెన్యూర్‌లకు) కేంద్ర ప్రభుత్వం త్వరలో 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను మంజూరు చేయనుంది. ఈ క్రెడిట్ కార్డులు ఏప్రిల్ 2025 నుండి అందుబాటులో రానున్నాయి. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని సంవత్సరాలలో సూక్ష్మ యూనిట్లకు రూ.30వేల కోట్ల మేర నిధులు అందించే అవకాశముంది. ఇది వారి వ్యాపార విస్తరణకు మద్ధతుగా నిలుస్తుంది.
క్రెడిట్ కార్డు లిమిట్, కండీషన్స్ :
* ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.5 లక్షల వరకు ఉంటుంది.
* చిరు దుకాణాలు, చిన్న స్థాయి తయారీ పరిశ్రమలు నిర్వహించే వ్యాపారులే ఈ క్రెడిట్ కార్డులకు అర్హులు.
* దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వ్యాపార పరిస్థితులను అంచనా వేసి ఈ క్రెడిట్ కార్డులు మంజూరవుతాయి.
* కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది.
* రూ.10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు మాత్రమే ఈ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ క్రెడిట్ కార్డును పొందేందుకు వ్యాపారులు ముందుగా “ఉద్యమ్” పోర్టల్‌లో తమ వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు.
దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కీలక దశలు
* “ఉద్యమ్” పోర్టల్ (msme.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* ‘క్విక్ లింక్స్’ పై క్లిక్ చేయండి.
* ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ సెలక్ట్ చేసుకోవాలి.
* రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
* ఇలా చేసిన సూక్ష్మ సంస్థలకు క్రెడిట్ కార్డు సౌకర్యం లభిస్తుంది.
ఈ క్రెడిట్ కార్డుల ద్వారా చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మరింత నిధులు పొందగలుగుతారు.