AP Kapu Leaders: ఏపీలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే సమీకరణలు మొదలయ్యాయి. తెర ముందు పార్టీలను ఉంచి.. తెర వెనుక కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణలపైనా పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే ఎన్నడూ లేనంతగా రాజకీయాలకు అతీతంగా కాపు నేతలు ఒకేతాటిపైకి వస్తున్నారు.గత కొంతకాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదంటూనే.. కీలక రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు మరింతగా సమీపిస్తున్న వేళ ఇలా పెడుతున్న సభలు, సమావేశాల్లో కొత్త నేతల చేరిక పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న విశాఖ వేదికగా జరగనున్న కాపుల సమావేశం సంచలనాలకు వేదికగా మారనుంది. రాజకీయ అజెండాతోనే అన్ని కాపు సంఘాలు, కాపు నేతలు ఒకే వేదికపై రావడం హాట్ టాపిక్ గా మారింది. సుమారు 50 వేల మందితో నిర్వహించనున్న సమావేశానికి అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలకు ఆహ్వానం పంపించారు. కానీ వైసీపీ నేతలు హాజరయ్యే చాన్స్ లేనట్టుగా తెలుస్తోంది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాపు నేతలు వరుసగా సమావేశాలు పెడుతున్నారు. హైదరాబాద్, విశాఖ కేంద్రంగా చాలాసార్లు సమావేశమయ్యారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ప్రాధాన్యత దక్కకుండా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాపులకు గుర్తింపు దక్కేలా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో కాపు నేతల సమావేశాలపై జనసేన విపరీతంగా ప్రభావం చూపుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న పవన్ టీడీపీతో జత కట్టేందుకు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు బీజేపీతోనూ కలిసే ఉంటారని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా.. మెజార్టీ కాపు నేతలు మాత్రం జనసేన వైపు అడుగులేస్తున్నారు.
అయితే ఇప్పుడు కాపు నేతల సమావేశాలు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కేంద్రంగా చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గంటా రాజకీయంగా సీనియర్. బలమైన కాపు సామాజికవర్గం నేత. ఆయనకు చిరంజీవితో మంచి సంబంధాలున్నాయి. ప్రజారాజ్యంలో యాక్టివ్ గా పనిచేశారు. ఈ నెల 26న విశాఖలో కాపునాడు సమావేశం వెనుక కర్త, కర్మ, క్రియ గంటాయేనని తెలుస్తోంది. వంగవీటి మోహన్ రంగా వర్థంతి సందర్భంగా కాపునాడు సమావేశం నిర్వహిస్తున్నారు. పోస్టర్ ను గంటా శ్రీనివాసరావే స్వయంగా ఆవిష్కరించారు. పోస్టర్ పై రంగాతో పాటు చిరంజీవి, పవన్ ఫొటోలను ముద్రించారు. దీంతో ఇది పక్కా వ్యూహంతో సాగుతున్న సమావేశంగా తేలుతోంది.

అటు బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ సమావేశమయ్యారు. కన్నా త్వరలో జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అదే కన్నా విజయవాడలోని గంటా నివాసానికి వచ్చారు. అదే సమయంలో టీడీపీ నేత బొండ ఉమా, చీరాలకు చెందిన ఎడం బాలాజీ తదితరులు వచ్చారు. అయితే ఇది కాపు నేతల సమావేశం కాదని.. అలా అయితే అందరూ వచ్చి ఉండేవారని చెబుతున్నా సంకేతాలు మాత్రం ఊహించినట్టే వస్తున్నాయి.
అయితే కాపు నేతల సమావేశాలకు వంగవీటి వారసుడు రాధా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం రాధాకృష్ణ టీడీపీలో కొనసాగుతున్నారు. 26న విశాఖలో జరగనున్న కాపునాడు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా కాపులంతా సంఘటితమయ్యామని సంకేతాలు ఇచ్చే చాన్స్ ఉంది. అయితే నాయకులు పావులు కదిపిన తీరు చూస్తుంటే పక్కా రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అటు వైసీపీ తప్పించి మిగతా పార్టీల నాయకుల యాక్టివ్ రోల్ చూస్తుంటే అధికార పార్టీకి వ్యతిరేకమన్న భావన కలుగుతోంది. అదే సమయంలో టీడీపీతోపొత్తుపై ప్రభావం చూపే అవకాశముందని ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే ఈ నెల 26 కాపుల పొలి కేక ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసే అవకాశముంది.