Manipur Violence: రెండు నెలలుగా, మణిపూర్ హింసాకాండతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. గత బుధవారం, ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది, ఇది మొత్తం దేశాన్ని కదిలించింది. యావత్ జాతి సిగ్గుపడేలా చేసింది. ముగ్గురు మహిళలను నగ్నంగా ఉరేగించే ఫుటేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు రోజులకు మరో ఘటన వెలుగుచూసింది. ఇందులో ఓ వ్యక్తి తలను నరికి చెట్టుకు వెలాడదీశారు. అయితే ఇంత హింస జరుగుతున్నా పోలీసులు, సైన్యం అదుపు చేయలేకపోవడమే ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది. నగ్నంగా ఉరేగించిన మహిళల్లో ఒక మహిళ మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
పిల్లలు ఉన్నారని చెప్పినా..
మే 4వ తేదీన తమపైదాడి జరిగిందని బాధిత మహిళ తెలిపింది. తమపై దాడి జరుగుతుందని తెలిసి పిల్లలను ఊరికి పంపిచామని చెప్పింది. భర్తతో కలిసి వెళ్తుంటే మైతేయి తెగ మూకలు తమను అడ్డగించి తీవ్రంగా కొట్టారని పేర్కొంది. దుస్తులు లాగేశారని వెల్లడించింది. తనకు పిల్లలు ఉన్నారని, చేతులెత్తి మొక్కుతున్నా వదిలేయండని వేడుకున్నా కనికరించలేదని కన్నీరు పెట్టుకుంది. వివస్త్రను చేసి ఊరేగించారని తెలిపింది. పోలీసుల ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
భద్రతా దళాలకు చెప్పినా..
గ్రామ పంచాయతీ సభ్యులతో సహా కొంతమంది వ్యక్తులు చురచంద్‌పూర్‌లో గందరగోళం గురించి తమకు తెలియజేశారు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఒకట్రెండు ఇళ్లు తగలబడిపోయాయని సమాచారం అందింది. భయంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రతా దళాల కంపెనీకి సమాచారం అందించినా రక్షించడానికి రాలేదని బాధితురాలు తెలిపింది. తండ్రి, కొడుకుతోపాటు ఒక మహిళను దారుణంగా చంపారు. ముగ్గురు మహిళలను కూడా బట్టలు విప్పి లైంగికంగా వేధించారు. పోలీసులకు ఫోన్ చేసినా రాలేదని వెల్లడించింది.