Jagan Vs Chandrababu
Jagan Vs Chandrababu: ఎన్నికల్లో గెలుపొటములు సహజం. 2014లో గెలుస్తాడు అనుకున్న జగన్ ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వస్తాననుకున్న చంద్రబాబు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు రెండు పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. విజయం పై రెండు పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. అయితే అధికార వైసీపీ నేతలు మాత్రం లోలోపల భయపడుతున్నారు. ఒకవేళ కానీ టిడిపి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు, జగన్ మధ్య పోరాటం.. రెండు పార్టీల నాయకుల మధ్యకు పాకింది.
గత నాలుగున్నర ఏళ్లుగా జగన్ సర్కార్ టిడిపి నాయకులను వెంటాడింది. కేసులు, దాడులతో వేటాడింది. కోడెల శివప్రసాద్ లాంటి నేత బలవన్మరణానికి పాల్పడడానికి ఈ వేధింపులే కారణం. అచ్చెనాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, దేవినేని ఉమా.. ఇలా పేరు మోసిన నాయకులంతా వైసీపీ ప్రభుత్వ బాధితులుగా మారిపోయారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. ఏకంగా సిఐడి కేసులు నమోదు చేయించి మరి జైలులో పెట్టించారు. జగన్ భారీ రివేంజ్ తీర్చుకున్నారు. గతంలో చంద్రబాబు చేతిలో బాధితులుగా మిగిలిన వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
అయితే ఇటువంటి కేసులకు ఆజ్యం పోసింది మాత్రం చంద్రబాబు అన్న అపవాదు ఉంది. చంద్రబాబు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో.. రోజా, నందిగాం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు తెలుసు. అంతెందుకు తన జైలు జీవితానికి చంద్రబాబు ప్రధాన కారణమని జగన్ ఇప్పటికీ అనుమానిస్తుంటారు. కేసులు పెట్టింది నాటి యుపిఎ ప్రభుత్వ హయాంలో కానీ.. దాని వెనుక ఉన్న అసలైన సూత్రధారి చంద్రబాబు అని జగన్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబును జైల్లో పెట్టించేంతవరకు నిద్రపోలేదు. అయితే జగన్,చంద్రబాబు మధ్య వైరంతో ఇరు పార్టీల నాయకులు భయపడుతున్నారు. భవిష్యత్ రాజకీయాలను తలుచుకుని బెంబేలెత్తుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే ఆ కూటమిదే విజయం అని వైసీపీ నేతలు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతను చూసి ఓటమి తప్పదని భయపడుతున్నారు. అటువంటి నేతలు భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందోనని ఆందోళనతో ఉన్నారు. ఒకప్పుడు రాయలసీమలో ఒక పార్టీ అధికారంలో ఉంటే.. ప్రత్యర్థులు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి తలదాచుకునేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే అదే పరిస్థితి పునరావృతం అవుతుందని రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కీలక నేతలు భావిస్తున్నారు. ఈ రివేంజ్ రాజకీయాలతో ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హుందా రాజకీయాలనేవి ఏపీలో కనిపించవని వాపోతున్నారు.