OFRO Srinivasa Rao’s murder : ఆ మధ్య కేసీఆర్ గాల్వాన్ లోయలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చాడు.. రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలకూ చెక్కులు ఇచ్చాడు.. ఇంతటి దాతృత్వాన్ని, అంతటి మహోన్నత్వాన్ని నమస్తే తెలంగాణ కీర్తించింది.. భుజకీర్తులు తొడిగింది. దేశ్ కి నేత అని పొగిడింది. కానీ అదే కేసీఆర్ సొంత రాష్ట్రంలో ఏదైనా జరిగితే స్పందించడు.. కనికరించడు.. ఓ కొండగట్టు ప్రమాదంలో అంతమంది కన్నుమూస్తే వీసమెత్తు పరామర్శకు వెళ్లడు.. ఇవన్నీ ఒకప్పటి ముచ్చట్లు అనుకుంటే.. భద్రాద్రి జిల్లాలో పోడు వివాదంలో ఓ ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు.. విధుల్లో ఉన్నంతవరకు అటవీ పరిరక్షణ కోసం పాటుపడిన ఆయన.. గొత్తి కోయల దాడిలో మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వచ్చాయి. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆదివాసులను మభ్యపెట్టి… పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటాలని మా పై ఒత్తిడి తెస్తున్నారని అటవీ శాఖ అధికారులు ఆరోపించారు. అదే సమయంలో పోడు సర్వేలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పేశారు.. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం అటవీ శాఖ అధికారులను బుజ్జగించే ప్రయత్నం చేసింది.
హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఇతర అధికారులను హుటా హుటిన ఖమ్మం పంపింది.. శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించింది.. అంతేకాదు శ్రీనివాసరావు భార్య విద్యావంతురాలు కావడంతో ఆమెకి ఉపాధ్యాయురాలి ఉద్యోగం ఇచ్చింది.. శ్రీనివాసరావు సర్వీస్ ఉన్నంతవరకు పూర్తిస్థాయి వేతనం ఇస్తామని కూడా చెప్పింది. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తామని అన్నది. అంతేకాదు ఎన్ ఎస్ పి లో 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పట్టాలను కలెక్టర్ గౌతం చేతుల మీదుగా అందజేసింది.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ స్థలానికి సంబంధించి అసలు గొడవ మొదలైంది.
ఆ 500 గజాల స్థలం ఎం ఎస్ పి ఉద్యోగులకు సంబంధించిందని తేలింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.. అది తెలిసి కూడా అదే స్థలాన్ని శ్రీనివాసరావు భార్యకు ప్రభుత్వం ఇచ్చింది.. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్పి ఉద్యోగులు ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు.. అంతేకాదు మరొకసారి కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ ఈ స్థలం బహిరంగ మార్కెట్లో కోట్లు పలుకుతోంది.. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు శ్రీనివాసరావు భార్య నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్మించినట్లు సమాచారం.. అందులో భాగంగానే శ్రీనివాసరావుకి ఇచ్చే వేతనంలో మినహాయించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. ఎన్నింటిలో పకడ్బందీగా వ్యవహరించిన ప్రభుత్వం స్థలం విషయంలో ఆ మాత్రం శ్రద్ధ వహించకపోవడం విశేషం. పైగా ఆ స్థలం చుట్టూ కంచె తొలగింపు విషయంలో ఒక అదృశ్య శక్తి కీలకంగా పని చేసినట్టు తెలుస్తోంది.. మరోవైపు శ్రీనివాసరావు భార్య ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అప్పట్లో శ్రీనివాసరావు చనిపోయినప్పుడు పరామర్శించేందుకు పోటీపడ్డ ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది.