Jagan Vs Ramoji Rao: మార్గదర్శి విషయంలో జగన్ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని మించిపోయి రామోజీరావును ఇరుకున పెడుతున్న సంగతి కూడా తెలిసిందే. చరిత్రలో తొలిసారిగా రామోజీరావును ఏపీ సిఐడి అధికారులు దఫ దఫాలుగా విచారిస్తున్నారు. బయటి ప్రపంచానికి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగానే తెలిసిన ఆయన కోడలు శైలజను వార్తల్లో వ్యక్తిని చేస్తున్నారు. ఏపీలోని 31 మార్గదర్శి శాఖల్లో చిట్స్ వేయకుండా చూస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో జగన్ ఇచ్చిన అధికారంతో ఏపీ సిఐడి అధికారులు మరింత రెచ్చిపోతున్నారా? దూకుడుగా వ్యవహరించే క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వారు త్వరలో జైలుకు వెళ్లే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది.
రామోజీరావు మీద ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించి అధికారులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వారు న్యాయస్థానం ఎదుట చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఐడీ చీఫ్ సంజయ్ సహా మొత్తం నలుగురు సిఐడి అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాలు చెప్పి ఇద్దరు అధికారులు హాజరు కాలేదు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఏమిటి లుక్ అవుట్ నోటీసు ఎందుకు జారీ చేశారని ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్పలేకపోయారు. “ఉత్తర్వుల ధిక్కరణ ప్రతీ సందర్భంలో జరుగుతోంది. మార్గదర్శి కార్యాలయాలు ఉండే ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కార్యాలయాల్లో రోజుల తరబడి సోదాలు చేస్తున్నారు. ఈ పేరుతో ఖాతాదారులను అడ్డుకుంటున్నారు. చిట్స్ వేసేవారిని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారాలు మొత్తం మా వద్దకు తీసుకొస్తున్నారు” అంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, మార్గదర్శి వ్యవహారంలో ప్రభుత్వం అధికారంలో చేతిలో పెట్టుకొని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సిఐడి అధికారులు కోర్టు ఎదుట నిలబడక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా జగన్ నియమించిన సీతారామాంజనేయులు అనే అధికారి మార్గదర్శి ఆపరేషన్ మొత్తం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే మార్గదర్శిని ఏపీ సిఐడి అధికారులు మరింత లోతుగా తవ్వుతున్నారు. సరికొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. కానీ, ఇదే సమయంలో మరో ఫండ్ కంపెనీ జోలికి ఏపీ ప్రభుత్వం వెళ్లడం లేదు. రేపు ఈ సంస్థ పై అమలు చేసిన కఠిన నిబంధనలు ఇతర సంస్థల విషయంలో ఎందుకు పట్టించుకోవడంలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క మార్గదర్శి నే ఎందుకు టార్గెట్ అనే ప్రశ్న వేస్తే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఏపీ అధికారులు ఉన్నారు. పక్కాగా కోర్టు ధిక్కరణలు.. అధికార దుర్వినియోగం కనిపిస్తుండడంతో ఏపీ అధికారులు కోర్టు ఎదుట దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందని న్యాయ నిబంధన చెబుతున్నారు. దీంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నది.