దేశంలో నిత్యం 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేక.. ఆక్సీజన్ సరఫరా సరిగా లేక, మందులు దొరక్కనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా వాస్తవం. ఇందులో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎంత? ఎవరి వాటా ఎంత? అనే విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఎవరి విమర్శలు వారిపై పడుతూనే ఉన్నాయి. ఇక్కడ చర్చ అది కాదు. ఇండియాలో రికవరీ రేటు ఎలా ఉందనే దానిపై!
దేశంలో కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం మూడు, నాలుగు లక్షలు కేసులు నమోదైన, నమోదు అవుతున్న సందర్భాల్లో మరణాల సంఖ్య 3 నుంచి 4 వేల మధ్యలో ఉంది. అయితే.. వీళ్లలోనూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. వీరు కాకుండా.. మిగిలిన వాళ్లంతా కరోనాను ధీటుగా ఎదుర్కొంటున్నట్టు లెక్క అని చెబుతున్నారు. దీనికి భారతీయుల్లోని సహజ ఇమ్యునిటీ కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతీ ఒక్కరిలోనూ ఇమ్యునిటీ పెంచుకునే అవకాశాలు ఒకే రీతిన ఉండవనేది వాస్తవం. వారి ఆర్థిక స్థోమత, తినే తిండి వంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు గ్రామీణులు ఖరీదైన తిండి తినలేరు. ధనవంతుల మాదిరిగా.. ఆరోగ్య నియమాలు పాటించలేరు. అయినప్పటికీ.. రూరల్ ఏరియాలోని వారు కూడా చాలా మంది రికవరీ అవుతున్నారు.
సహజంగా ఉన్న ఇమ్యునిటీతో వాళ్లంతా కొవిడ్ ను తరిమి కొడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 3 కోట్ల 34 లక్షల మందికి కొవిడ్ సోకినట్టు సమాచారం. వీరిలో 5.95 లక్షల మంది చనిపోయినట్టు సమాచారం. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్ల 22 లక్షలకు చేరుకుంది. 2.42 లక్షల మంది చనిపోయారు. అయితే.. అమెరికాలో ఉన్న వైద్య సౌకర్యాల గురించి అందిరికీ తెలిసిందే. ప్రజలకు అధునాతన వైద్యం అందిస్తోంది అగ్రదేశం. కానీ.. అమెరికాతో పోల్చినప్పుడు ఇండియాలో వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ.. మరణాల రేటు తక్కువగా ఉంది.
ఇదంతా.. భారతీయుల్లోనూ సహజ ఇమ్యునిటీ వల్లే సాధ్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ లో గనక అమెరికా మాదిరి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటే.. మరణాల రేటు ఇంకా తక్కువగా ఉండేదన్నది నిపుణుల మాట. ఉన్న కొద్దిపాటి సౌకర్యాలతోనే చాలా మంది కొవిడ్ ను జయిస్తున్నారు. కాబట్టి.. నమోదవుతున్న కేసులు.. రికవరీ రేటును పరిశీలించినప్పుడు.. భారతీయులు కరోనాను జయిస్తున్నట్టే లెక్క అంటున్నారు. అందువల్ల.. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాల్సి ఉంది. సంతోషంగా ఇంటికి చేరాల్సిన అవసరం ఉంది.