https://oktelugu.com/

Gulf Troubles: ‘ఆడుజీవితం’ రిపీట్.. సౌదీ ఎడారిలో భిక్కుమంటున్న తెలుగోడిని ఇలా తీసుకొచ్చారు

విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సొంత గ్రామాల్లో ఉపాధి లేక.. కుటుంబ కష్టాలను అధిగమించలేక ఎక్కువమంది విదేశీ బాట పడుతున్నారు. కానీ ఏజెంట్లు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 26, 2024 / 11:52 AM IST

    Gulf Troubles

    Follow us on

    Gulf Troubles: ఎడారి దేశాల్లో భారతీయులు చిక్కుకోవడం ఇటీవల కామన్ గా మారింది. కొద్దిరోజుల కిందట కువైట్ లో చిక్కుకున్న శివ అనే యువకుడు సోషల్ మీడియాలోఓ వీడియో పోస్ట్ చేశాడు.కటిక ఎడారిలో జంతువుల మధ్య తాను పడుతున్న బాధలను ఏకరువు పెట్టాడు.సోషల్ మీడియాలో విపరీతం వైరల్ కావడంతో.. ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. భారత ప్రభుత్వంతో మాట్లాడి శివను స్వస్థలానికి రప్పించారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా కోనసీమకు చెందిన వీరేంద్ర సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు.అదే మాదిరిగా ఆయనను సైతం కాపాడి స్వస్థలానికి రప్పించే ఏర్పాట్లు చేశారు లోకేష్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేల వీరేంద్ర కుమార్ ఈనెల 10న ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తామని సౌదీ అరేబియా తీసుకెళ్లారు. అక్కడ ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారు. వాటి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సరైన భోజన వసతి లేక వీరేంద్ర రక్తపు వాంతులు చేసుకున్నాడు.ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. తాను పడిన బాధలను వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో చూసిన మంత్రి లోకేష్ స్పందించారు. భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

    * బాధితులకు సినిమా కష్టాలు
    అయితే ఇటీవల విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న బాధితులు లైఫ్ ‘ఆడు జీవితం’ సినిమాకు దగ్గరగా ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా మొన్న ఆ మధ్యన వచ్చిన ఈ సినిమాలో..మలయాళీ యువకుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తాడు.అక్కడ ఎన్నో రకాలుగా కష్టాలు పడతాడు. చివరకు ప్రభుత్వం చొరవ చూపి స్వస్థలానికి రప్పిస్తుంది. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆ యువకుడు ఇసుకను సేకరించి పనిలో ఉంటాడు.ఆయన భార్య గర్భవతి కావడంతో..పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్తు, సొంత ఇల్లు, మెరుగైన జీవితపు కోసం ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి.. 30000 ఖర్చు చేసి సౌదీ వెళ్తాడు. కానీ అక్కడ ఏజెంట్ అతడికి ఎడారిలో గొర్రెలు, మేకలు, వంటలు కాసే పనిలో పెడతాడు. అక్కడ ఆ యువకుడు ఎన్నో రకాల కష్టాలు పడతాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ఎడారి దేశాల్లో భారతీయులు దుర్భర జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో.

    * ఏజెంట్లు మోసం
    ఇటీవల ఏజెంట్ల చేతిలో మోసపోతున్న భారతీయ యువకులు.. ఎడారుల్లో ఒంటెలు కాచే పనులకు కుదురుతున్నారు. ఏజెంట్ ఒక దేశం పేరు చెబితే.. మరో దేశానికి తీసుకెళ్లి రకరకాల పనులు చేయిస్తున్నారు. కడుపునిండా తిండి పెట్టరు. కంటి నిండా నిద్ర కూడా ఉండదు. తాజాగా వీరేంద్ర తనకు ఎదురైన పరిణామాలు చెబుతుంటే ఆడు జీవితం సినిమా గుర్తుకు రావడం ఖాయం. స్వగ్రామాల్లో ఉపాధి దొరకక.. కుటుంబ పరిస్థితులను అధిగమించలేక.. విదేశాలకు వెళ్తున్న యువత దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెప్పలేక బాధలను దిగమింగుకొని సతమతమవుతున్నారు. అయితే పరిస్థితులను తట్టుకోలేని వారు సోషల్ మీడియా వేదికగాసహకారం కోసం అర్ధిస్తున్నారు.

    * నిర్బంధ కూలీలుగా..
    ఉపాధి కోసం దేశాలు దాటుతున్న భారతీయ యువత నిర్బంధ కూలీగా మారుతున్నారు. అమానుష చర్యలకు బాధితులుగా మిగులుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో.. కటిక ఎడారుల్లో జంతువులకు పోషకులుగా మారుతున్నారు. వెల్డర్, ఫిట్టర్ వంటి భవన నిర్మాణ పనులకు అని చెప్పి.. విదేశాలకు రప్పిస్తున్న ఏజెంట్లు ముఖం చాటేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని కటిక ఎడారుల్లో విడిచి పెడుతున్నారు. నాలుగు నెలల కిందట పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఇదే ఇతివృత్తంతో వచ్చిన ‘ఆడు జీవితం’ గల్ఫ్ కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇప్పుడు బాధితులకు అదే రిపీట్ అవుతోంది.