Home Car Loans : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే రెండో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పీఎన్‌బీ, హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్స్ పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పీఎన్‌బీ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లను ఫిబ్రవరి 10, 2025 నుంచే అమలులోకి తెచ్చింది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఫిబ్రవరి 20 అంటే నిన్న ఓ ప్రకటన చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం.. మారుతున్నటు వంటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోటీతత్వ ఆర్థిక పరిష్కారాలను అందించడంలో బ్యాంక్ నిబద్ధతతో వడ్డీ రేట్లను సర్దుబాటు చేస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు హోమ్ లోన్స్, కారు లోన్స్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులకు వర్తిస్తాయి. వినియోగదారులు విభిన్న ఫైనాన్సింగ్ ఎంపికలను పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.’ అని బ్యాంక్ తెలిపింది. సుమారు ఐదు సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని లోన్లు తీసుకున్న తమ కస్టమర్లకు బదిలీ చేస్తూ పీఎన్‌బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత హోమ్ లోన్స్ పై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది.
మార్చి 31, 2025 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఫీ లేదని సదరు బ్యాంక్ తెలిపింది. అలాగే 30 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్ ఎంచుకునే అవకాశం కూడా ఇస్తుంది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్, మారటోరియం పీరియడ్ల వంటి వాటిని సైతం అందజేస్తుంది. సుమారు రూ.5 కోట్ల వరకు లోన్ ఇస్తామని బ్యాంక్ చెబుతోంది. లక్ష రూపాయలకు ఈఎంఐ రూ.744 నుంచే ఉంటుందని తెలిపింది.
అలాగే పీఎన్ బీ డిజి కారు లోన్ ద్వారా 8.50 శాతం నుంచే వడ్డీ రేట్లకు లోన్లు ఇస్తోంది. రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తుంది. రూ.లక్షకు రూ.1,240 వరకు ఈఎంఐ ఉంటుందని తెలిపింది. పీఎన్‌బీ గ్రీన్ కారు ఇ-వెహికల్ రుణాలకు 0.05 శాతం తక్కువ వడ్డీ రేటుకే లోన్లు ఇస్తున్నట్లు పేర్కొంది. పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్ లో అప్లై చేసుకున్న వాళ్లకు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఇస్తోంది. వడ్డీ రేట్లు ప్రస్తుతం 11.25 శాతం నుంచి మొదలవుతాయి.