Global Financial Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. మయన్మార్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. పాకిస్తాన్లో తినేందుకు తిండి గింజలు కూడా లేవు. చైనాలో ఖాతాదారులు దాచుకున్న సొమ్ము ఇవ్వడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. మే నెలలో నిత్యావసరాల ధరలు 8.6% పెరిగినట్టు అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు విషయంలో అక్కడి ఫెడరల్ బ్యాంకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఏ దేశం చూసినా ఎదురితే కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అల్లకల్లోలమైన ప్రపంచం ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముందు నిలిచింది. గ్యాస్ నుంచి తాగే పాల వరకు ప్రతి వస్తువు ధర పెరగడంతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడింది.

అంతకంతకు పెరుగుతోంది
ఆసియా నుంచి లాటిన్ అమెరికా దేశాల వరకు ఆర్థిక మాంద్యం ముందు నిలిచాయి. ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో దేశాల బడ్జెట్లు తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సాధారణంగానే ఆ దేశాల్లో అస్తవ్యస్త పాలన ఉంటుంది. స్థిరత్వం లేని ప్రభుత్వాల వల్ల సైనిక జోక్యం ఎక్కువ. దీనికి తోడు విపరీతమైన అవినీతి. పులి మీద పుట్రలా రెండేళ్లుగా కోవిడ్ సృష్టించిన సంక్షోభం, ప్రస్తుత ఉక్రెయిన్ రష్యా యుద్ధం దాపరించాయి. దీంతో చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి లెక్కకు మిక్కిలి అప్పులు, తీవ్ర నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధిలో మందగమనం, అధిక ద్రవ్యోల్బ ణం అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల పుట్టి ముంచుతున్నాయి. లాటిన్ ఆఫ్రికాలో 25 దేశాలు, ఆసియా పసిఫిక్ లో 25 దేశాలు, ఆఫ్రికాలో 19 దేశాల్లో శ్రీలంక తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో 170 కోట్ల జనాభా ఉంటుందని అంచనా. ప్రస్తుతం వారంతా ఆర్థిక మాంద్యం తాలూకు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక శ్రీలంకకు పొరుగున మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఎవరికీ తీసిపోలేదు. ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంకతో సమానంగా అప్పు కలిగి ఉన్నాయి.
Also Read: Revanth Reddy: రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం.. నీళ్లలో నిండా మునిగింది.!
ఈ ఏడాది చివరి నాటికి మాంద్యం ముంగిట
2022 చివరికి ప్రపంచం మొత్తం దివాలా తీస్తుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. డ్రాగన్ కబంధహస్తాల్లో చిక్కుకుని లంక విలవిలాడుతున్న నేపథ్యంలో మరో దేశం అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా చూడాలని విన్నవిస్తున్నారు. అప్పులు ఇచ్చే దేశాల్లో చైనా అగ్రభాగాన ఉంది. షరతులు విధించడంతో రుణ గ్రహీతలు నిలువు దోపిడీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. రుణాలు చెల్లించని పక్షంలో డ్రాగన్ దేశం ఏకంగా ఆక్రమణకు తెగిస్తోంది. పక్కనే ఉన్న టిబెట్, పాకిస్తాన్, ఇప్పుడు శ్రీలంక.. దేశాలే వేరు. చైనా బాధిత దేశాల బాధలు మాత్రం ఒకటే. చైనా, రష్యా వంటి దేశాలు సామ్రాజ్య విస్తరణకు పూనుకోవడంతో ప్రభావం ప్రపంచం మీద కనిపిస్తోంది. చైనాలో పెట్టుబడులకు కొరత ఉండడంతో భారత్ లాంటి బలమైన మార్కెట్ వ్యవస్థ కలిగిన దేశాల మీదకి తన కంపెనీలను వదులుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ పరిశ్రమగా ఉన్న చైనా తన ఉత్పత్తులను అతి చవకగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయి. పైగా చైనా కంపెనీలు పన్నులు ఎగ్గొట్టి మాతృదేశానికి తరలిస్తున్నాయి. ఇది కూడా శత్రుదేశంపై చైనా సాగిస్తున్న ఆర్థిక యుద్దం లాంటిదే. ఇక రష్యా కూడా సామ్రాజ్య విస్తరణలో చైనాతో పోటీపడుతోంది. గతంలో ఇరాన్, ఇరాక్ తో యుద్ధం చేసి చేతులు కాల్చుకున్న అమెరికా ఉదంతం కూడా రష్యాకు కనువిప్పు కలిగించడం లేదు. రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఆ దేశం మీద యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. ఈ ప్రభావం మొత్తాన్ని ప్రపంచం చవిచూస్తోంది. రష్యా మీదనే ఆధారపడి ఉన్న ఈజిప్ట్ నుంచి కెన్యా వరకు దేశాలు ఇప్పుడు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఆర్థిక నిపుణులు హెచ్చరించిందే ప్రస్తుతం జరుగుతోంది
రష్యా తో ఉక్రెన్ యుద్ధం ప్రారంభమయ్య సమయంలోనే ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టే ప్రస్తుతం జరుగుతోంది. దేశాలకు దేశాలే ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. మరోసారి ఆర్థికమాంద్యం ముంగిట ప్రపంచం నిలబడి ఉంది. 2022 చివరి నాటికి ఈ ముప్పు మరింత తీవ్రమవుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు 2008లో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన ఆర్థికమాంద్యాన్ని ప్రజలు ఇంకా మర్చి పోలేదు. ఇప్పుడు అదే తరహాలో ప్రపంచ దేశాలను ఆర్థిక మాద్యం చుట్టుముడుతోందనే నిపుణుల హెచ్చరికలు అందరిలోనూ ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పుట్టి ముంచుతున్న ఉచిత పథకాలు
చాలా దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట నిలబడేందుకు ప్రధాన కారణం ఉచిత పథకాలు. ఒకప్పుడు లాటిన్ అమెరికా దేశాల్లో వెనిజులాది ప్రత్యేకమైన స్థానం. షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా వినతి కెక్కిన బ్రెజిల్ తో ఆ దేశం పోటీపడేది. వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ కే పాఠాలు నేర్పింది. కానీ అధికారంలోకి వచ్చేందుకు అక్కడి పాలకులు ఉచిత పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెట్టడంతో దివాలా తీసింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు లేక బేల చూపులు చూస్తోంది. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితినే ఎప్పటినుంచో అనుభవిస్తున్నది. ఇది ఒక వెనిజులా ఉదంతం మాత్రమే కాదు. అధికారంలోకి వచ్చేందుకు భారత్ నుంచి మొదలు పెడితే నైరోబీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనివల్ల ప్రజలు సోమరులుగా మారిపోతున్నారు. ఖజానా పై ఒత్తిడి అధికమవుతున్నది. పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వాలు అప్పులు తీసుకురావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఫలితంగా వృద్ధిరేటు మందగించి భవిష్యత్ తరానికి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. దీంతో నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. అవకాశాల కోసం ఎంతో విలువైన మానవ వనరులు ఇతర దేశాలకు వలస వెళుతున్నాయి. దీనివల్ల దేశ అభివృద్ధి మందగిస్తోంది. ఇది అంతిమంగా అక్కడి ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. ఉచిత పథకాలు అసలు ప్రవేశ పెట్టొద్దు అని ఐక్యరాజ్యసమితి నుంచి స్థానిక బ్యూరోక్రాట్ల వరకు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాంద్యం ముంగిట నిలబడటంతో ఒక తరమే వెనక్కి వెళ్లాల్సిన అగత్యం దాపురించింది.
Also Read:Presidential Elections 2022 : రాష్ట్రపతి ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న ప్రతిపక్షాలు
[…] Also Read: Global Financial Crisis: మాంద్యం ముంగిట ప్రపంచం […]