Narsapuram: శ్రీమంతుడు సినిమాలో చూశాం ఊరిని దత్తత తీసుకుని హీరో చేసే పనులకు గ్రామస్తులంతా పులకించిపోతారు. అచ్చంగా అదే తరహాలో ఓ పెళ్లి వేడుకలో కానుకగా ఓ రోడ్డు బాగు చేసి ఔరా అనిపించుకున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిలో ఆసక్తి రేపుతోంది. ఎవరైనా పెళ్లికి విందులు, వినోదాలు ఏర్పాటు చేయడం సహజమే. కానీ ఇక్కడ మాత్రం ఓ రోడ్డు నిర్మాణం చేయడం గమనార్హం.

నరసాపురం మెయిన్ రోడ్డు నుంచి కొత్త నవరసపురం వరకు కిలోమీటరు రోడ్డు గుంతలమయంగా మారింది. ఎన్నిమార్లు నాయకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శనివారం జరిగే పెళ్లికి హాజరయ్యే బంధువులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని భావించారు. దీంతో రూ.2 లక్షలు పెట్టి రోడ్డును సుందరంగా తీర్చిదిద్దారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తయారు చేశారు. దీంతో అందరిలో హర్షం వ్యక్తం అవుతోంది.
వరుడు హర్షవర్ధన్ రోడ్డుకు మరమ్మతులు చేయించడంపై అందరిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి కానుకగా రోడ్డు బాగు చేయించడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇది పెళ్లి వారి కానుకగా అభివర్ణిస్తున్నారు. జేసీబీతో రోడ్డు చదును చేయించి థార్ పోసి రోడ్డును చక్కగా ముస్తాబు చేశారు. దీనిపై అందరు పెళ్లి కుమారుడిని అభినందిస్తున్నారు.
వెయ్యి మాటలు చెప్పే కన్నా ఒక్క పని చేసి చూపిస్తే చాలని హర్షవర్ధన్ నిరూపించాడు. ఆయనలోని దాతృత్వాన్ని మెచ్చుకుంటున్నారు. పక్కవాడి బాధలను సైతం పట్టించుకోని రోజుల్లో రోడ్డు బాగు చేయించి ఆయన చూపిన తెగువ నిజంగా ప్రశంసనీయమే. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం తమ లైకులు కొడుతూ సహకరిస్తున్నారు.