YCP: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల మార్పు సంచలనం రేపుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారు. తమను మార్చితే ప్రజా వ్యతిరేకత తగ్గిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలను విడిచిపెట్టి… కేవలం బిసి, ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. దీనిపైనే పార్టీలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. పైగా రాజకీయంగా జూనియర్ అయినా ఎంపీ మిధున్ రెడ్డి సమీక్షించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అయితే సొంత సామాజిక వర్గం విషయంలో జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం.. అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో రెడ్డి సామాజిక వర్గం సీఎం జగన్ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థుల మార్పు విషయంలో సొంత సామాజిక వర్గం జోలికి వెళ్లకూడదని జగన్ ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా సొంత సామాజిక వర్గం నేతలను మార్చితే.. అదే సామాజిక వర్గం నేతలకు బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి అంటే చాలు ఎమ్మెల్యేలు వణికుపోతున్నారు. అన్నింటికీ మించి అక్కడ మిధున్ రెడ్డి సమీక్షించడం, ఆయనతో అభ్యర్థుల మార్పు చెప్పిస్తుండడాన్ని సీనియర్లు సహించుకోలేకపోతున్నారు. మిధున్ రెడ్డి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. అయినంత మాత్రాన ఒక జూనియర్ చేతిలో జాబితాని పెట్టి.. పిలిచి అవమానిస్తారా అంటూ ఎమ్మెల్యేలు నిట్టూరుస్తున్నారు. ఏదైనా మాట్లాడాలంటే జగన్ నేరుగా కలుగజేసుకోవచ్చు కదా? మధ్యలో మిధున్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధినేత తీరును అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ నలుగురికి జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. క్యాబినెట్లో సీనియర్ మంత్రులు ఉన్నా.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఉన్నారు. కానీ వారంతా అచేతనంగా మారారు. ప్రత్యామ్నాయ అవకాశాలు లేక జగన్ నీడలో ఉండి పోవాల్సి వచ్చింది. అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో కొంతమంది సీనియర్లు ఉన్నట్లు సమాచారం. వారందరినీ పిలిచి మిథున్ రెడ్డి ఎదుట కూర్చోబెడుతున్నారు. ఆయన సమీక్ష చేసి అభ్యర్థుల మార్పు ఉంటే చెబుతున్నారు. లేకుంటే చాన్స్ లేదని తేల్చేస్తున్నారు. తమకు టిక్కెట్ఇవ్వకపోవడం కంటే.. జూనియర్ తో చెప్పించడాన్ని వైసీపీ సీనియర్లు సహించలేకపోతున్నారు. లో లోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాల్ చేస్తున్నారు.