
Kanna – Rayapati : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అన్న నానుడి ఇప్పుడు సరిగ్గా గుంటూరు జిల్లా టిడిపి నేతలకు సరిపోతుంది. ఒకప్పుడు వేర్వేరు పార్టీలో ఉంటూ ఉప్పు.. నిప్పుగా రగిలిపోయిన ఆ నేతలు.. ఇప్పుడు నాకు నువ్వు.. నీకు నేను అంటూ సరికొత్త రాగం అందుకుంటున్నారు. ఎవరా నేతలు..? ఏమిటా కథ చదివేయండి.
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తన దూకుడు పెంచారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి నేతలు అందరితోనూ కన్నా.. తాజాగా తన నివాసంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు నియోజకవర్గాల ఇన్చార్జిలు మినహా టిడిపిలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే అందరూ కలిసి సమిష్టిగా పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కలిసిన కన్నా, రాయపాటి కుటుంబాలు..
గుంటూరు జిల్లాలో గత కొన్నేళ్లుగా ఉప్పు, నిప్పుగా ఉంటున్న కన్నా, రాయపాటి కుటుంబాలు ఈ సమావేశంలో కలిసిపోవడం గమనార్హం. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో వైరివర్గంగా ఈ రెండు కుటుంబాలు ఉంటూ వస్తున్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఇచ్చిన విందుకు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కన్నా, రాయపాటి సాంబశివరావు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవి. 2014లో కన్నా బిజెపిలో చేరగా, రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరారు. గతంలో ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులు కూడా వేసుకున్నారు. ఇటీవల ఈ కేసులకు సంబంధించి ఇరు వర్గాలు రాజీ చేసుకున్నాయి.
తెలుగుదేశం పార్టీకి మరింత బలం..
గతంలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కన్నా, రాయపాటి వర్గాలు కలిసిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని 17 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు లోక్ సభ సీట్లు కూడా విజయం సాధించేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం తర్వాత నేతలంతా గురజాలలోను టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని, ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని అమరావతి కోసమే తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాయపాటి సాంబశివరావుకు తెలిసేనా..
కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఆయన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు శ్రీనివాస్ హాజరైన విషయం ఆయనకు తెలుసా..? తెలియదా..? అన్న అన్న చర్చ కొంత నడుస్తోంది. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరని సమయంలో రాయపాటి సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. ఆయన రాకను కొంత వ్యతిరేకించినట్లు ఆయన మాటల్లో అర్థం అయింది. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు స్వయంగా ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.