కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊపిరాడకుండా చేస్తోంది. కేసులెక్కువగా ఉండడంతో పాటు మరణాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో అనేక ప్రాణాలు పోతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రాణవాయువు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ కోసం అనేక రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుతం అత్యవసర వస్తువైన ఆక్సిజన్ కోసం ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ప్రణాళిక రచించాడు. ప్రజలకు ప్రాణవాయువును సత్వరంగా అందించేందుకు బృహత్తర చర్యలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ వాయువు ప్రతీ రాష్టంలో అత్యవసర వస్తువుగానే మారింది. అయితే ఏపీలో మాత్రం జగన్ ప్రజలకు ఆక్సిజన్ అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాడు. జగన్ సర్కార్ ఆక్సిజన్ ప్లాంట్ కోసం యుద్ధప్రాతిపదికన రూ.309.87 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. అంతేకాకుండా 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
ఆక్సిజన్ త్వరగా సరఫరా చేసేందుకు 10వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు నెలకు రూ.10 లక్షల చొప్పున ఆరు నెలలపాటు నిధులను సమకూర్చనుంది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ప్రక్రియ సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షన్ ఇన్చార్జిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కు బాధ్యతలను అప్పగించారు. ఈయన ఆక్సిజన్ ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతిని పర్యవేక్షిస్తారు. అలాగే అవసరమున్న వారికి ఆక్సిజన్ అందే విధంగా చర్యలు తీసుకుంటాడు.
ఇక అధిక బిల్లులు వసూలు చేసే ఆసుపత్రులపై జగన్ సర్కార్ కొరఢా ఝులిపించనుంది. ఇప్పటికే పలు ఆసుపత్రులను సీజ్ చేసిన విషయం తెలిసింది. కరోనా వైర్ సోకిన రోగులు తమకు వచ్చిన వైరస్ కంటే బిల్లులను చూసే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆర్తనాదాలను విన్న జగన్ ఈ విషయంపై కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నాడు. ఏదీ ఏమైనా కష్టకాలంలో ఇలాంటి యుద్ధప్రాతిపకదిక నిర్ణయాలు కొంత వరకే మేలేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.