Volunteer System: ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ కు వలంటీర్ల వ్యవస్థ మానస పుత్రిక. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. సంక్షేమ పథకాల అమలు నుంచి పౌరసేవల వరకూ అన్ని వలంటీర్లకే అప్పగించారు. రూ.5 వేల గౌరవ వేతనం, స్మార్ట్ ఫోన్లు, ఏడాదికి ఒకసారి సన్మానాలు, సత్కారాలు, ప్రోత్సాహక నిధులు.. ఇలా ఒకటేమిటి. అన్నంటా ఏపీ ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నామినేటెడ్ పోస్టు కంటే వలంటీరుకు ప్రధాన్యమిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ ఠంచనుగా జీతం వస్తుందో లేదో చెప్పలేం కానీ.. వలంటీరు అకౌంట్ లో మాత్రం ఫస్ట్ తారీఖుకే నగదు వేస్తున్నారు. తొలినాళ్లలో వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా వలంటీరు వ్యవస్థను గొప్పగా చెప్పుకునేవారు. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి.. ఇప్పుడు అదే వలంటీరు వ్యవస్థ వైసీపీ ప్రజాప్రతినిధులకు కంటగింపుగా మారింది. ప్రతిబంధకంగా తయారైంది. తమ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని కిందిస్థాయి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు తెగ బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ బాధ సెగ ఎమ్మెల్యేలకు కూడా తాకింది. అసలు ప్రజలు తమను లెక్క చేయకుండా వలంటీరుకే అగ్రతాంబూలం ఇవ్వడంపై వారు కుతకుత ఉడికిపోతున్నారు. ఇటీవల పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సైతం ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు ఇదే ఆవేదనను వెలిబుచ్చారు. ప్రభుత్వం వలంటీరుకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వలేదని తమ మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఫిర్యాదుల వెల్లువ..
వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి సన్నాహాలుగా.. ప్రతీ నియోజకవర్గంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులతో పాటు క్రియాశీలక నేతలు హాజరయ్యారు. వారంతా ప్రజా సమస్యలు చెప్పడం కంటే వలంటీర్లపైనే ఫిర్యాదు చేయడం కనిపించింది. మా గ్రామంలో ప్రజలు సమస్యలను తమను విన్నవించడమే మానేశారని.. సంక్షేమ పథకాలు, పౌరసేవలు,. చివరకు చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సైతం వారినే ఆశ్రయిస్తున్నారని.. అటువంటప్పుడు ఈ పదవులు ఎందుకని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫిర్యాదు చేశారు. వారిని బుజ్జగించడం వైసీపీ ప్రజాప్రతినిధులకు కష్టంగా మారింది. మీకు ఇష్టం లేనివారి పేర్లు చెప్పండి తీసేద్దామంటూ సర్దుబాటు చేయడం మంత్రులు, ఎమ్మెల్యేల వంతైంది. ఎక్కడికక్కడే ఇదే సమస్య ఎదురైంది. అంబటి రాంబాబు, తానేటి వనిత, దాడిశెట్టి రాజా వంటి మంత్రులు ప్లీనరీలకు హాజరుకాగా ఈ ఫిర్యాదుల పరంపరే ఎక్కువైంది. తమ హక్కులను కాలరాసే విధంగా వలంటీర్లు వ్యవహరిస్తున్నారంటూ వారు పడే బాధ వర్ణనాతీతం. అవును ఇది ముమ్మాటికీ నిజమే కానీ.. ఏరికోరి పార్టీ వారని వలంటీర్లుగా నియమించుకున్నామని.. వారు కొరకరాని కొయ్యగా మిగులుతారని అనుకోలేదని అమాత్యులు సైతం తెగ బాధపడిపోతున్నారు. అలాగని అక్కడికక్కడే విధుల నుంచి తొలగిస్తామంటే రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని భయపడిపోతున్నారు. మరోవైపు వలంటీరు వ్యవస్థే మున్ముందు పార్టీకి దిక్కని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలుండడంతో ఏం చేయలేని నిస్సహాయత. అటు స్థానిక ప్రజాప్రతినిధులను బుజ్జగించ లేక.. ఇటు వలంటీర్లపై చర్యలు తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితులను మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు.
Also Read: Revanth Reddy: ఏడాది ప్రస్థానం: కాంగ్రెస్ ను ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిలో ఏం చేశాడు?
వారితోనే కార్యక్రమాల నిర్వహణ..
మొన్నటికి మొన్న వైసీపీ చేపట్టిన గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ వెనుక ఇదే పెద్ద కారణం. అన్నీ వలంటీర్లు చూసుకుంటే ఇక మా పదవులు, మా పనితీరు ఎందుకని చాలా మంది గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కీనుక వహించారు. వలంటీర్ల సాయంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల ముందుకెళ్లారు. దీంతో ఎక్కడికక్కడే నిలదీతలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. గ్రామస్థాయిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్న వారికి బిల్లలు మంజూరు చేయడం లేదు. అదే వలంటీర్లకు మాత్రం ఠంచనుగా ఒకటో తారీఖు కు జీతాలు అందిస్తున్నారు. దీనిని కూడా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అవమానంగా భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వలంటీర్లు గ్రామస్థాయి నేతలకు సహకరించడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బంధువులు, కుటుంబసభ్యులకు మాత్రమే పథకాలు, పౌరసేవల్లో ప్రాధాన్యిమిస్తున్నారు. దీంతో రాజకీయంగా అక్కడ దెబ్బతింటున్నామన్నది ఒక వాదనగా ఉంది. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. వలంటీరు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలమని భావిస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే వలంటీర్ల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఒక వర్గం ఉంటే.. మరో వర్గం రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలుపుతోంది. అటువంటి వారిని తొలగించాలని నేతలు పట్టుబడుతున్నా నాయకత్వం పట్టించుకోవడం లేదు. ఇలానే మున్ముందు కొనసాగితే వలంటీరు వ్యవస్థ రివర్ష్ అవ్వడం ఖాయమని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Electric Meters Agricultural Pump Sets: ఏపీ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం.. జగన్ నిండా మునిగాడా?