Telangana Congress: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి తథ్యమంటున్నారు. వరుసగా రెండుసార్లు అధికారం సాధించిన కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతనే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లను గెలిపిస్తుందంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇక ప్రస్తుతం బీజేపీ ఊపు ఉన్నా ఆ పార్టీకి తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో సరైన నేతలు, నాయకత్వం, కార్యకర్తల బలం లేదు. ప్రముఖంగా దక్షిణ తెలంగాణలో అసలు బీజేపీకి పట్టు లేదు. అదే కాంగ్రెస్ కు రాష్ట్రమంతటా బలమైన పునాదులున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో మంచి రోజులు ఉన్నట్లే కనిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు లేవు. అది కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కానుంది. అంతేకాదు.. కేంద్రప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారనుంది. కొన్ని వర్గాలు బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ధరలు, పెట్రోల్ రేట్లు పెరుగుదలతోపాటు ఆ పార్టీ పట్ల పేద, మధ్య తరగతి ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు.
ఇక దేశంలోని మెజార్టీ రైతులు బీజేపీని, బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రధాన వర్గాలు మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు అధికార పార్టీపై అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంది. రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో సహజంగానే తలెత్తే అసంతృప్తి విపక్షాలకు అనుకూలంగా మారుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఎక్కువ శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం కూడా ఆ పార్టీకి బూస్ట్ లా పనిచేసిందంటున్నారు.
బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యేస్థాయి నేతలే లేరు. కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలతోపాటు క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు వందకు పైగా నియోజకవర్గాల్లో బలమైన పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీనే. నాడు అసలు బీజేపీ బలం మచ్చుకైనా లేదు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు సాధించింది.
కాంగ్రెస్ కు అనాదిగా నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈసారి కూడా ఆయా జిల్లాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ నే గెలుచుకుంటుందని ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇక్కడి ప్రజలు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా కాంగ్రెస్ కు వరంగా మారనుంది.
టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కాంగ్రెస్ నేతలు తమపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. తాము ఓట్లు వేసి గెలిపించుకున్నా పార్టీ మారరు అని.. టీఆర్ఎస్ లోకి జంప్ చేయమన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాలి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ లో చేరికలు కూడా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముంది..
ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొంత కాంగ్రెస్ లో చురుకుదనం వచ్చిన మాట వాస్తవమే.. కాంగ్రెస్ నేతలు ఐక్యతగా ఉండి కలిసి పనిచేస్తే ఈసారి ఎన్నికల్లో అధికారానికి రావడం పెద్ద కష్టమేమీ కాదు..