
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ జమిలీ ఎన్నికల పాట పాడుతోంది. కరోనా లాక్ డౌన్ తో ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై దేశ ప్రజల్లో పీకల్లోతు కోపం ఉంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనూ ఇప్పుడు బీజేపీ మళ్లీ గెలవదంటున్నపారు. ఇంతటి వ్యతిరేకతలోనూ తాజాగా కేంద్రప్రభుత్వం మళ్లీ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది.
దేశంలో ఇప్పటికే 2014-19 మధ్యకాలంలో జరిగిన 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రప్రభుత్వం రూ.5814 కోట్ల నిధులు విడుదల చేసింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం వేర్వేరుగా వ్యయం చేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యయం తగ్గించేందుకు అన్ని ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికలూ తరుచూ నిర్వహించడం వల్ల నిజంగానే సాధారణ ప్రజాజీవితం ఇబ్బందులకు గురవడంతోపాటు వారికి అందే అత్యవసర సేవలపైనా ప్రభావం పడుతుంది. అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిపితే ఏటేటా వాటి నిర్వహణ వ్యయం భారం తగ్గిపోతుంది.
ఈ మేరకు కేంద్రం జమిలీ ఎన్నికలకు మళ్లీ తెరలేపుతోంది. ఎన్నికల సంఘంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగు సిఫార్సులు చేసింది. ఈ విసయాన్ని మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మకంగా మార్గసూచిక చేయాలని యోచిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.
జమిలీ ఎన్నికలను ప్రాంతీయపార్టీలన్నీ వ్యతిరేకించే ప్రమాదం ఉంది. బెంగాల్ సీఎం మమత, తెలంగాణసీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా వీరంతా కూడా తమ పూర్తి సంవత్సరాలు నిండకుండా మధ్యలోనే జమిలీ ఎన్నికలకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇక జమిలీ ఎన్నికలతో జాతీయ పార్టీలకే లాభం.. ప్రాంతీయపార్టీలకు తీవ్ర నష్టం. అందుకే ఈ ప్రతిపాదనను ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలున్నాయి.