Great Nicobar Project: భారతదేశం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి గ్రేట్ నికోబార్ దీవిలో రూ.72 వేల కోట్లతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రణాళిక దేశ ఆర్థిక, రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా, చైనా విస్తరణకు చెక్ పెట్టే వ్యూహం అని కేంద్రం చెబుతోంది. అయితే, ప్రతిపక్షాలు, పర్యావరణవాదులు దీన్ని ఆదివాసీ సంస్కృతులకు, జీవవైవిధ్యానికి ముప్పుగా చూస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత తాజాగా రాసిన ఆర్టికల్‌తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
మౌలిక సదుపాయాలు, అభివృద్ధి..
2021లో ప్రారంభమైన ఈ ప్రణాళిక, నితిæ ఆయోగ్ 2022లో ఆమోదించింది. అండమాన్ – నికోబార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏఎన్‌ఐఐడీసీవో) ద్వారా అమలు చేస్తున్న దీని ప్రధాన భాగాలు ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్‌షిప్‌మెంట్ టెర్మినల్ (ఐసీటీటీ), అంతర్జాతీయ విమానాశ్రయం, 450 మెగావాట్ గ్యాస్ – సోలార్ ఎనర్జీ ప్లాంట్, 16 వేల హెక్టార్లలో మెగా టౌన్‌షిప్. గలతీ బేలో జనాభా తక్కువగా ఉన్న ప్రదేశంలో ఐసీటీటీ నిర్మాణం, 2050 నాటికి 6.5 లక్షల మంది నివాసం ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. ఇది హాంకాంగ్ మోడల్‌పై ఆధారపడి, కొలంబో, పోర్ట్ క్లాంగ్‌లతో సమాన దూరంలో ఉండటం వల్ల వాణిజ్యానికి అనుకూలం. 2027–28 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యం, 2025 జూలైలో ఎన్‌జీట్జీకి నివేదిక సమర్పించారు.
ఇండో–పసిఫిక్‌లో భారత్ ఆధిపత్యం
గ్రేట్ నికోబార్ మలాక్కా స్ట్రెయిట్ ప్రవేశ ద్వారానికి సమీపంలో (సిక్స్ డిగ్రీ చానల్), ప్రపంచ వాణిజ్యంలో 30–40% రవాణా జరిగే ప్రాంతం. చైనా 80% చమురు దిగుమతులు ఇక్కడి ద్వారా జరుగుతాయి, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ప్రభావం పెంచుకోవడానికి ’స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహంలో భాగంగా హమ్బంటోటా (శ్రీలంక), చిట్టాగాంగ్ (బంగ్లాదేశ్), క్యాక్కుయుక్–వ్యూ (మయన్మార్), కోకో ఐలాండ్స్‌లో మిలిటరీ స్థావరాలు నిర్మిస్తోంది. ఇండోనేషియాలో సుందా, లాంబోక్ స్ట్రెయిట్‌ల సమీపంలో చైనా నౌకాస్థావరాలు ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో, గ్రేట్ నికోబార్‌లో డీప్ సీపోర్ట్, డ్యూయల్–యూజ్ విమానాశ్రయం (సివిల్–డిఫెన్స్) నిర్మించడం భారత్‌కు మలాక్కా సందిపై పట్టు దొరుకుతుంది. విశాఖపట్నం ఏకైక తూర్పు నావల్ బేస్‌పై ఒత్తిడి తగ్గుతుంది, ఫిజీ, జపాన్‌తో కనెక్టివిటీ పెరుగుతుంది. ‘నెక్లెస్ ఆఫ్ డైమండ్స్’గా అండమాన్–నికోబార్‌ను చూస్తూ, ఈ ప్రాజెక్టు భారత్ ’ఆక్ట్ ఈస్ట్’ పాలసీ, ఏజీఏఆర్ డాక్ట్రిన్‌కు బలం. ఇప్పటికే బాజ్ నావల్ ఎయిర్ స్టేషన్ ఉంది, ఇది చైనా ప్రభావానికి ప్రతివ్యూహంగా పనిచేస్తుంది.
పర్యావరణ, ఆదివాసీ ఆందోళనలు..
900 చదరపు కి.మీ. విస్తీర్ణంలో రెండు జాతీయ పార్కులు (క్యాంప్‌బెల్ బే, గలతీ) ఉన్న దీవి, 800కి పైగా వృక్ష జాతులు, నికోబార్ మెగాపోడ్ పక్షి, లెదర్‌బ్యాక్ తాబేళ్లు, మొసళ్లు ఇక్కడ జీవిస్తాయి. ప్రాజెక్టు 15% అడవులను(8.5 లక్షల నుంచి 58 లక్షల వృక్షాలు) నరికితే, కోరల్ రీఫ్‌లు, మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటాయి. డ్రిల్లింగ్, ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి, పక్షులు, జంతువుల వలసలు ఆటంకపడతాయి. షాంపెన్ (పీవీజీటీ, 200–300 మంది), నికోబారీస్ తెగలు (1,761 మంది) జీవనోపాధి అడవులపై ఆధారపడి ఉంది. 2004 భూకంపం తర్వాత నికోబారీస్ గ్రామాలు కూలిపోయి, తిరిగి స్థిరపడాలని ఆశలు పెట్టుకున్నారు, కానీ ప్రాజెక్టు భూములు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (ఎఫ్‌ఆర్‌ఏ) 2006, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉల్లంఘన అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ)లో తెగలు పాల్గొనలేదు. ట్రైబల్ కౌన్సిల్ రద్దు చేసింది. సీస్మిక్ జోన్‌లో ఉండటం వల్ల భవిష్యత్ విపత్తులకు దీని రూపం మారవచ్చు.
సమతుల్య అభివృద్ధి అవసరం
ఈ ప్రాజెక్టు భారత్‌కు వాణిజ్య హబ్‌గా, రక్షణ బలంగా మారవచ్చు, సింగపూర్, కొలంబో పోర్టులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. చైనా ’స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’కు ప్రతిస్పందనగా ఇది ఇండో–పసిఫిక్‌లో క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) లక్ష్యాలకు సహాయపడుతుంది. అయితే, పీవీటీజీల జీవన విధానం, ఏకైక జీవవైవిధ్యం కాపాడాలి. ప్రభుత్వం ట్రైబల్ ఇన్‌పుట్ తీసుకుంటే, గ్రీన్ టెక్నాలజీ (సోలార్, ఎకో–ఫ్రెండ్లీ పోర్ట్) అమలు చేస్తే సమతుల్యత సాధ్యం.