Barrelakka: బర్రెలక్క పై దాడి షురూ.. మరీ ఇంత నిజానికి దిగజారాలా?

శిరీష అలియాస్ బర్రెలక్క తండ్రి ఆమె తల్లికి దూరంగా ఉంటున్నాడు. కూతురు అంటే పెద్దగా ఇష్టపడడు. పైగా తాగుబోతు.. ఇప్పుడు ఈ విషయాన్ని కొంతమంది ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 26, 2023 12:30 pm

Barrelakka

Follow us on

Barrelakka: అనుకున్నదే జరుగుతోంది. అనుమాన పడిందే నిజమవుతోంది. కొల్లాపూర్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషపై దాడి జరుగుతోంది. ఎప్పుడైతే ఆమె నామినేషన్ వేసిందో.. ఎప్పుడైతే సోషల్ మీడియా ఆమెకు అండగా నిలబడిందో.. ఒక వర్గం మీడియా ఆమె పోరాటాన్ని గొప్పగా మెచ్చుకుందో.. అవే ఇప్పుడు ఆమెకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఆమె అడుగుతున్న ప్రశ్నలు, నిలదీస్తున్న విధానం అధికార పార్టీని ఇబ్బంది పెడుతుండడంతో సహజంగానే ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రకరకాల వ్యక్తుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా వారు వదలడం లేదు. అకాడికి వారిదో శుద్ధ పూసలైనట్టు.. ఆమె వ్యక్తిగత జీవితం మీద లీటర్ల కొద్ది బురద చల్లుతున్నారు.

పెళ్లయితే ఏంటి..

శిరీష అలియాస్ బర్రెలక్క తండ్రి ఆమె తల్లికి దూరంగా ఉంటున్నాడు. కూతురు అంటే పెద్దగా ఇష్టపడడు. పైగా తాగుబోతు.. ఇప్పుడు ఈ విషయాన్ని కొంతమంది ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు.. ఆమె తన తండ్రి తనకు దూరంగా ఉంటున్నాడని ఎప్పుడో చెప్పేసింది. దానికి కారణం కూడా చూచాయగా వివరించింది. అయితే ఆమెకు గతంలో పెళ్లయిందని, విడాకులు కూడా తీసుకుందని తాజాగా కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. ఆమె పెళ్లి కార్డును కూడా చూపిస్తున్నారు.. అయితే ఆ పెళ్లి కార్డులో ” మీ పేరు మా మదిలో ఉన్నది. మీకు ఇదే మా ఆహ్వానం అంటూ” ఉండడం ఒకిం అనుమానానికి తావిస్తోంది. వాస్తవానికి వివాహ ఆహ్వాన పత్రికలో ఆహ్వానించే వారి పేరు కింద ఉంటుంది.. ఆహ్వానితుల కాలంలో వారి పేరు మన రాస్తాం. అలా కాకుండా మీ పేరు మా మదిలో ఉన్నది మీకు ఇదే మా ఆహ్వానం అని రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతున్నది. కానీ ఎవరైతే శిరీషను ట్రోల్ చేస్తున్నారో వారు గమనించని విషయం ఒకటి ఉంది. పెళ్లి చేసుకోవడం, భర్తతో విడిపోవడం అనేది శిరీషకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. వాటి గురించి ఆమె ఎనాడూ చెప్పుకోలేదు. బహుశా అవి చేదు జ్ఞాపకాలయి ఉంటాయి. అలాంటప్పుడు ఆమెను నిలదీయడం దేనికి? ఇలా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం దేనికి?

చదువుతో కూడా..

శిరీష ది పేదరికమైన కుటుంబం. ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది. బీఈడీలో సీటు రావడంతో త్వరలో చేరేందుకు రెడీ అవుతోంది. ఆ మధ్య తాను చేసిన బర్రెల వీడియోతో కోర్టు కేసులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ బర్రెలు కూడా అమ్మేసినట్టుంది.. అయితే ఇప్పుడు ఎన్నికలు రావడంతో అనూహ్యంగా నామినేషన్ వేసింది. బర్రెల వీడియోతో పాపులర్ అయిన శిరీష ను నామినేషన్ వేసిన అనంతరం నెత్తిన పెట్టుకుంది. ఆమె మాట్లాడిన తీరు కూడా ఆకట్టుకుంటున్నది. ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో గెలుస్తుందా? ఎమ్మెల్యే అయి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందా? ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? ఆమె ఎంతవరకు చదువుకుంది? ఇన్ని ప్రశ్నలకు పెద్దగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత అధికార పార్టీ క్యాబినెట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్హత ఎంత? మల్లారెడ్డి విద్యార్హతపై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఏం చదువుకున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి.. ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. నేరుగా మన వ్యవస్థను ప్రశ్నిస్తోంది అంటే శిరీష రూపంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన లేత కలలు, ప్రశ్నించే గొంతుకలు ఇంకా భద్రంగానే ఉన్నట్టు కదా!