
MLC Kavitha: సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న రాత్రి ఈడి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత ముఖంలో కళ తగ్గింది. నిర్వేదం కనిపించింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి.. అంటే ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నట్టు? దేనికి సంకేతాలు ఇస్తున్నట్టు? మళ్లీ ఈరోజు విచారణ అంటే? దానికి ఈడీ ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నట్టు? ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం విచారణ అనంతరం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. వాస్తవానికి కవితను సోమవారం పదిన్నర గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మళ్లీ మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు రావాలని ఆమె చేతికి తాఖీదు అందించారు. సోమవారం ఉదయం 10:30 కు ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించిన కవిత రాత్రి 9 గంటల 15 నిమిషాలకు బయటకు వచ్చారు. లోపల నుంచి బాగా నిర్వేదమైన ముఖంతో వచ్చిన ఆమె.. కాళ్లు కూర్చున్న తర్వాత ముఖానికి చిరునవ్వు అద్దుకున్నారు. కార్యకర్తలకు విజయ సంకేతం చూపించారు.
Also Read: MLC Kavitha : హమ్మయ్యా… అరెస్ట్ లేదు: ఊపిరి పీల్చుకున్న కవిత: రేపు మళ్ళీ విచారణ?!
ఢిల్లీలో నిన్న కవితను అరెస్టు చేస్తారంటూ మీడియా మొత్తం ఊదరగొట్టింది. కానీ ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని ఈడీ అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు. మీడియాకు కూడా అనధికారికంగా వెల్లడించారు. అయితే మంగళవారం విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని చెప్పలేనని అదే అధికారి వివరించడం గమనార్హం. కవితను సోమవారం ఈడీ కార్యాలయం రెండవ అంతస్తులోని ఒక గదిలో సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారి జోగేందర్, మహిళా అధికారితో పాటు మరో ముగ్గురు ఆమె మీద ప్రశ్నల వర్షం కురిపించారు.. వారు వరుసగా ప్రశ్నలు వేయడంతో కవిత అలా చూస్తూ ఉండిపోయింది. కొన్ని సాంకేతికపరమైన ఆధారాలు చూపించడంతో ఆమె ఖంగు తిన్నది. ఇక ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన అరుణ్ పిళ్ళై తో కవితను ముఖాముఖి ప్రశ్నించాలని అధికారులు భావించారు. కానీ దానికి పిళ్ళై అంగీకరించకపోవడంతో ఆయనను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుమందు ప్రవేశపెట్టారు. ఆయనకు ఈడి కస్టడీ ముగియడంతో జైలుకు పంపించారు. ఈ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్ని సాక్షాలతో అధికారులు విచారించారు.. హైదరాబాదులోని ఐటిసి కోహినూర్, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ సమావేశాలకు సంబంధించిన పత్రాలను ఆమెకు చూపించారు.. అలాగే పిళ్ళై సౌత్ గ్రూప్ తరఫున, కవిత తరఫున జరిపిన సంభాషణలనూ ఆమెకు వినిపించి, పలు కీలక ప్రశ్నలు అడిగారు.

ఇక కవిత గతంలో సమర్పించిన బ్యాంక్ స్టేట్మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీల గురించి, కవిత నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా వారు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. మనీష్ సిసోడియాతో ఆమెకున్న రాజకీయ సంబంధాలు, ఆమ్ ఆత్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ తో భేటీకి కారణాలపైనా ఈడి అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ కవిత తన నివాసంలో ఇండస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు ను కలుసుకున్న సందర్భంగా గురించి కూడా వారు ప్రశ్నించారు. కవిత ధ్వంసం చేసిన ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని బయటకు లాగినట్టు తెలుస్తోంది. అభిషేక్ బోయినపల్లి, మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి.. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడి అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ మధ్యలో కవిత తీవ్ర అసౌకర్యానికి గురి కావడంతో వైద్య బృందాన్ని పిలిపించి పరీక్షలు నిర్వహించారు.
ఇక సోమవారం రాత్రి కవిత ఇంటికి వెళ్లిన తర్వాత… ఆమెను మంగళవారం పిలిపించి ఇదేవిధంగా ప్రశ్నల వర్షం కురిపించి.. చివరి నిమిషంలో అరెస్టు చేయాలని ఈడి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. వాస్తవానికి కవిత బయటకు రావడంతోనే ఇక విచారణ ఉండదు అని మీడియా అనుకున్నది. కానీ మీడియా అంచనాలను తలకిందులు చేస్తూ ఈడి అధికారులు మంగళవారం కూడా రావాలని ఆమె చేతికి తాఖీదు ఇచ్చారు. దీంతో ఢిల్లీలోని ఈడి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరోవైపు ఢిల్లీలోనే తిష్ట వేసిన మంత్రి కేటీఆర్ రాత్రి జరిగిన పరిణామం తర్వాత ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లాయర్ సోమ భరత్ కూడా నిర్వేదంలో మునిగిపోయారు. అంటే కవిత అరెస్టు దాదాపు ఖాయమని వారికి తెలిసిందా?! మంగళవారం ఏం జరుగుతుంది?! కాలం గడిస్తే గాని ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.
Also Read: MLC Kavita – ED : 7 గంటల పాటు విచారణ.. మరి కవిత సంతకాలు ఎందుకో?