
Telangana SIT: నయీమ్ డైరీ కేసు, జూబ్లీహిల్స్ పబ్ కేసు, సినీ తారల డ్రగ్స్ కేసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు…ఇవన్నీ దర్యాప్తు చేసింది, చేస్తోంది సిట్ అధికారులు.. ఇన్ని కేసుల్లో ఏ ఒక్క దాంట్లో కూడా పురోగతి లేదు. మరీ దారుణం ఏంటంటే అప్పట్లో సిమ్మార్ రైస్ కు సంబంధించి మిల్లర్ల పై ఇదే సిట్ దర్యాప్తు చేసింది. కొద్ది రోజులు హడావుడి చేసింది. తర్వాత ష్ గప్ చుప్. ఊదు కాలింది లేదు. పీరి లేచిందీ లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల ను డైవర్ట్ చేసేందుకు సిట్ అనే ఆయుధాన్ని వాడుతోంది.. అంతే అంతకుమించి ఏమీ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నయీమ్ ఎన్కౌంటర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర బలగాలకు కేంద్ర బలగాలు తోడు కావడంతో అతడి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.. కానీ నయీమ్ గురించి ముందే సమాచారం ఉన్న ప్రభుత్వం తర్వాత చాకచక్యంగా వ్యవహరించింది.. అతని కేసు కేంద్ర దర్యాప్తు బృందం పరిధిలోకి వెళ్లకుండా..సిట్ ను రంగంలోకి దింపింది.. నయీం డైరీ ని స్వాధీనం చేసుకుంది. కానీ ఇంతవరకు నయీం ఆస్తులు, ఆయన అనుచరుడు శేషన్న ఆస్తులు ఏం చేసిందో కూడా చెప్పలేదు.. వందల కోట్ల నగదు, కిలోల కొద్ది బంగారం ఏమైపోయాయో కూడా తెలియదు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకు బదిలీ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసు అంతరిదాపు కోల్డ్ స్టోరేజీ లోకి వెళ్లినట్టే.
ఆ మధ్య సినీ తారల డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది.. గోవా నుంచి నేరుగా డ్రగ్స్ హైదరాబాద్ వస్తున్నాయని, సినీ తారలు వాటిని విరివిగా వాడుతున్నారని తెలియ వచ్చింది. ప్రభుత్వం రెండో మాటకు తావు లేకుండా సిట్ కు ఈ కేసును అప్పగించింది.. అకున్ సబర్వాల్ నేతృత్వంలోని అధికారులు పలువురు సినీ నటులను విచారణకు పిలిపించారు.. వీరిలో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, రవితేజ, సుబ్బరాజు వంటి వారు ఉన్నారు.. కొద్దిరోజుల పాటు విచారణ జరిగిన ఈ కేసు… తర్వాత ఎప్పటి లాగానే కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది.

ఇక జూబ్లీహిల్స్ లో ఓ పబ్ లో మైనర్ పై అత్యాచారానికి సంబంధించిన కేసును కూడా సిట్ దర్యాప్తు చేసింది.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.. తర్వాత నిందితులు కటకటాల పాలయ్యారు. ఈ కేసులోనూ కీలక ఆధారాలు లభించినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోవడంలో సిట్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులోనూ సిట్ అధికారుల అత్యుత్సాహం అందరికీ తెలిసిందే.. దర్యాప్తు పేరుతో హడావిడి చేసిన అధికారులు.. కొండను తవ్వి ఎలుకను పట్టారు..ఇక ఈ కేసును దర్యాప్తు చేయొద్దని సాక్షాత్తు కోర్టు ఆదేశించింది అంటే అధికారుల పని తీరు అర్థం చేసుకోవచ్చు.
తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి దర్యాప్తును సిట్ చేపడుతోంది.. మీడియాకు రోజుకో రకంగా లీకులు ఇస్తోంది. సరే ఇందులో ఏం తేలుతుంది అనేది పక్కన పెడితే.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు ఒక భవనం అంటూ లేదు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు.. మరోవైపు హైదరాబాదులో పోలీసులకు బందోబస్తుకే సరిపోతుంది. కానీ కేసులు దర్యాప్తు చేయాల్సిన రావడంతో అనివార్యంగా కొంతమంది అధికారులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. కేసుల దర్యాప్తు బాధ్యత ప్రభుత్వం అప్పగిస్తున్నది.. గత అనుభవాల నేపథ్యంలో..ఈ కేసు కూడా కోల్డ్ స్టోరేజీ లోకి వెళ్లడం ఖాయమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..