D. K. Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం పై ఎవరు కూర్చుంటారనే ప్రశ్నకు మూడు రోజుల తర్వాత సమాధానం దొరికింది. కన్నడ సీఎంగా సిద్ధ రామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించేసింది. సీఎం రేసులో ఇద్దరున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది.
-డీకేను తప్పించడానికి కారణాలు ఇవే..
కర్ణాటకలో వచ్చని విజయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఈ విజయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు డీకే శివ కుమార్ పాత్ర ఎంతో ఉంది. ఆర్థికంగా ఆ పార్టీకి అండగా నిలిచాడు. పార్టీ విజయంలో అన్నీ తానై ముందుకు నడిచాడు.
కానీ ఆదాయపు పన్ను, ఈడీ నుంచి ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసులను డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నాడు. 2024 ఎన్నికలకు ముందు ఈ కేసులను మరింత వేగవంతం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని అవకాశాలను వినియోగించుకోనుందనే భావన కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. బీజేపీ పై ధీటుగా పోరాడాలంటే డీకేను సీఎం రేసు నుంచి తప్పించడమే మేలని కాంగ్రెస్ భావిస్తున్నది.
సాధారణ ఎన్నికల వేళ సీఎం ఈ కేసులను ఎదుర్కొవడం ద్వారా నష్టం తప్పదనే భావన కాంగ్రెస్ లో మెదిలింది. ఈ కారణంగానే డీకేను తప్పించి సీనియర్ నేత, క్లీన్ ఇమేజ్ ఉన్న సిద్ధరామయ్యను సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
– కులాల లెక్కలు..
ఓబీసీ వొక్కలిగ కులానికి చెందిన డీకే శివకుమార్ ను సీఎంగా చేస్తే కాంగ్రెస్ లోని ఇతర కులాల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడేది. సిద్ధరామయ్య ఎంపికతో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టినట్లయ్యింది.
-శెనార్తి