Liger Movie Exhibitors: దర్శకుడు పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ దారుణ ఫలితం చూసింది. 2022 ఆగస్టు 25న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. మూవీపై భారీ హైప్ ఏర్పడింది. దీంతో విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి థియేట్రికల్ రైట్స్ అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మొత్తంగా మునిగిపోయాడు. ఎగ్జిబిటర్స్, లీజర్స్ భారీగా దెబ్బతిన్నారు. లైగర్ నష్టాల్లో కొంత మేర తిరిగి చెల్లించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పది నెలలుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల తెరపైకి వచ్చింది.
మే 12న తెలంగాణా ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ధర్నాకి దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లైగర్ నిర్మాతలుగా ఉన్న పూరి జగన్నాథ్-ఛార్మి తమకు న్యాయం చేయాలని, లేదంటే నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ వివాదంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుందని సమాచారం. లైగర్ చిత్ర నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ కి మధ్య సంధికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జిబిటర్స్ రూ. 9 కోట్ల పరిహారం అడుగుతున్నారని వినికిడి.
దాదాపు వారం రోజులుగా జరుగుతున్న ఈ దీక్షను నేడు విరమించినట్లు తెలుస్తుంది. అలా అని వాళ్లకు డబ్బులు ముట్టలేదట. కొంత మొత్తం తిరిగి చెల్లించేందుకు హామీ ఇచ్చారట. తెలుగు నిర్మాతల మండలి ఈ మేరకు చెప్పి ఒప్పించి దీక్ష విరమింప చేయించారంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లైగర్ హక్కులు రూ. 55 కోట్లకు అమ్మారు. అధిక మొత్తాలకు లైగర్ హక్కులు అమ్ముకున్న పూరి-ఛార్మి సేఫ్, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ మాత్రమే నష్టపోయారనే వాదన ఉంది.
గతంలో లైగర్ నష్టాలు చెప్పిన ప్రకారం తిరిగి చెల్లిస్తాను. ధర్నాలు, నిరసనలు చేసిన వాళ్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ పూరి జగన్నాధ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు. పూరి-ఛార్మి నిర్మాతలుగా మారి మరోసారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.