ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం.. రోజుకొకటి చొప్పున ఈ వార్త వింటూనే ఉన్నాం. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ దాడులు కామన్ అయిపోయాయి. అయితే..ఈ దాడులు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుట్రేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఓ ఆంగ్ల వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో స్వామి ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడానికే తెలుగుదేశం ఈ దాడులు చేయిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: అధికార పార్టీ టార్గెట్ బీజేపీ కాదంట.. ఆయనపైనే విమర్శలు
ఈ సంఘటనలపై ఏపీ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని కూడా స్వామి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో తెల్లవారుజామున రెండు గంటలకు పూజలు చేసి కూడా, వాటిని రాజకీయ ప్రచారాల కోసం వాడుకోలేదని స్వామి గుర్తు చేశారు. అలాగే టీటీడీ ఆదాయవ్యయ వ్యవహారాలను కాగ్ పరిధిలోకి తీసుకురావడం కూడా జగన్ చేసిన మంచి పని స్వామి ప్రస్తావించారు. ఎన్నికల్లో సోనియాగాంధీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త కుట్రలకు తెరతీశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలుగుదేశం హయాంలోనే టీటీడీలో క్రిస్టియన్ల నియామకం జరిగిందని, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకా టీటీడీలో హిందూయేతరులను నియమించకూడదని నిర్ణయం తీసుకున్నారని అది కూడా మంచి చర్య అని అభివర్ణించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని, ఆయన భార్య మిషనరీ అని కూడా కొంతమంది ప్రచారం చేశారని.. అయితే వారు నరేంద్రమోడీ కన్నా గొప్ప హిందువులని స్వామి అన్నారు.
Also Read: స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్
అంతేకాదు.. ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వమే అన్ని ఆలయాలనూ స్వాధీనం చేసుకుని, ముఖ్యమంత్రే అన్ని ఆలయాలకూ చైర్మన్ అంటూ ప్రకటించుకుందని, ఈ విషయంపై తను కోర్టుకు ఎక్కినట్టుగా స్వామి తెలిపారు. ఆ కేసు విచారణలో ఆలయాలపై అధికారం ప్రభుత్వానికి ఉండదనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసిందని, పూర్తి విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వాల మీద ఇది వరకూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఏదిఏమైనా బీజేపీ ఎంపీ జగన్‌పై ఇలా సానుభూతి ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్