Etela Rajender: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా మారింది పరిస్థితి. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బాధ్యులు అవుతారో చూస్తున్నాం. రాష్ర్టంలో రాజకీయాలు కూడా అదే తీరుగా తిరుగుతున్నాయి. గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. ఇన్నాళ్లు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కే విజయావకాశాలు మెండుగా ఉన్నా తరువాత పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ నేతల తప్పులకు ఈటలపై ప్రబావం పడుతోంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఘటనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది. దాని ప్రభావంతో రాష్ర్టంలో కూడా పార్టీకి ఎదురుగాలి వీచే అవకాశం ఏర్పడుతోంది. దీంతో ఏ చెట్టునైతే నమ్ముకున్నారో ఆ చెట్టే ఈటల పాలిట శాపంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. దీన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
జాతీయ పార్టీ కావడంతో అప్పుడు తనకు రక్షణగా ఉంటుందని ఈటల పార్టీలో చేరినా ఆయనకు తగిన ప్రాధాన్యం మాత్రం దక్కలేదు. కానీ ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో చోటు దక్కినా ప్రస్తుతం రాష్ర్టంలో మాత్రం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారనుంది. ఈటల తన పరువు నిలుపుకోవాలని భావించినా చివరికి ఏం జరుగుతుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. దీంతో బీజేపీ తీరుతో ఈటలకు గండమే పొంచి ఉంది. మరోవైపు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై పెద్ద ప్రభావమే చూపనుంది. లఖింపూర్ ఘటన దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది.
ఈటల రాజేందర్ మొదట్లో బీజేపీలో చేరేందుకు తటపటాయించినా చివరికి ఏ అవకాశం లేక చేరారు. కానీ అదే ఇప్పుడు ఆయన ప్రస్థానానికి ప్రశ్నార్థకం కానుంది. తన మనుగడకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి పోటీ ఏర్పడిన సందర్భంలో ఈటల ఏమేరకు పట్టు సాధిస్తారో అని అందరిలో అంచనాలు పెరిగిపోతున్నా ప్రస్తుత తరుణంలో బీజేపీ నేతల నిర్వాకంతో మొదటికే మోసం వచ్చేట్లుగా ఉంది.