
సీబీఎస్ఈ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ కరోనా కల్లోలంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేశాయి. అందరినీ పాస్ చేయించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎంత కఠిన కరోనా ఉన్నా.. కేసులు పెరిగినా.. వేవ్ లు వచ్చినా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కగా తాజాగా విచారణ జరిగింది.
పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది.
పరీక్షలతో ఒక్క విద్యార్థి చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రెండోదశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయిందని అనుకోవద్దని.. తర్వాత పరిణామాలకు ఎవరు బాధ్యులని సుప్రీం ప్రశ్నించింది. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలని.. ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని.. ముందుముందు థర్డ్ వేవ్ అంటూ మరిన్ని వేరియంట్లు వస్తున్నాయంటున్నారని.. ఇలా విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాతో వెళ్లాలని.. గ్రేడ్లను మార్కులుగా మలచలేమని.. అయినా పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షల సమయంలో మూడోవేవ్ వస్తే ఏం చేస్తారని ఏపీ సర్కార్ ను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.