
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలను గుర్తించడానికి ఉద్దేశించిన టెస్ట్ కిట్స్ ను రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ కిట్స్ ను ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ లో కరోనా కిట్స్ తయారీని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కిట్స్ తయారీ ఊపందుకున్నాయని. మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తొలి కిట్ ను సీఎం ఆవిష్కరించే అవకాశం ఉంది.
రాష్ట్ర అవసరాల కోసం ప్రస్తుత వాటి తయారీ కొనసాగుతోందని, వచ్చే వారం నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. టెస్ట్ కిట్స్ తో పాటు వెంటిలేటర్లను కూడా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇదివరకే 30 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సాంకేతికత, మార్గనిర్దేశకాల ఆధారంగా టెస్టింగ్, డయాగ్నసిస్ ఎక్విప్ మెంట్ ను రూపొందిస్తున్నాయి ఆ కంపెనీలు.
ప్రతినెలా ఆరువేల వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్డర్ విశాఖపట్నానికి చెందిన ఏఎంటీజెడ్ మెడికల్ సర్వీసెస్ సంస్థ నుంచి అందినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలించాల్సి ఉంటుందని, దాని తరువాతే వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.