ఇండియాలోని టాప్ 25ఐపీఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభచూపిన ఐపీఎస్ లపై ఫేమ్ ఇండియా, పీఎస్ యూ వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఏజెన్సీ, మీడియా నివేదికల ఆధారంగా చేపట్టిన సర్వే వివరాలను మంగళవారం ప్రకటించగా ఇందులో ఎం.మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 12, 2017న డీజీపీగా నియమించింది. మహేందర్ రెడ్డి గతంలో గోదావరిఖని అసిస్టెంట్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సీపీగా పని చేశారు.
ఈ సర్వేలో నక్సలిజం, టెర్రరిజం, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణ వంటి అంతర్జాతీయ నేరాలను పరిగణలోకి తీసుకున్నట్లు పీఎస్ యూ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శుక్లా తెలిపారు. నేరాలను నియంత్రించే సామర్థ్యం, నిజాయితీ, ఫ్రెండ్లీ పోలీసింగ్లో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. టాప్ 25ఐపీఎస్ అధికారుల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి చోటు దక్కడంతో ఆయనను ఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ స్వాతి లక్రా అభినందించారు.