
ఆర్ధిక సంవత్సరం చివరిలో కరోనా దెబ్బ వేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసూలు కావలసిన పన్నులు వసూలు కాకపోవడం, అత్యవసరమైన పనుల కోసం నిధులు అవసరం అవుతూ ఉండడంతో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత, భత్యాలలో కొత్త విధించినా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు.
ప్రభుత్వనాయికి ఏప్రిల్ మాసంలో ఇప్పటి వరకు సుమారు రూ. 2,400 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, వచ్చిన ఆదాయం రూ. 6 కోట్లు మాత్రమేనని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సరిగ్గా ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా పంజా విసరడంతో కేవలం మర్చి చివరి వారంలోనే రూ.5,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నుంచి పరిస్థితి మరింత విషమించడంతో తెలంగాణ ఆదాయం 95 శాతానికిపైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, వారి సంక్షేమాన్ని కాపాడేందుకు పెద్ద యుద్ధమే చేయవలసి వస్తున్నది. ఆస్తి పన్ను దగ్గర నుండి అన్ని రకాల పన్నుల చెల్లింపులను వాయిదా వేయడంతో పాటు విద్యుత్ బిల్లుల వసూళ్లు సహితం వాయిదా పడింది. దానితో ఆదాయ వనరులు దాదాపు సూన్యం అని చెప్పవచ్చు.
కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గినా.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలు సకాలంలో సర్దుబాటుకాకపోయినా సొంత రాబడులతో నెట్టుకు వస్తున్న కేసీఆర్ కు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఇబ్బందికరంగానే మారుతున్నది. మరోవంక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిత వచనాలు చెప్పడమే గాని కేంద్రం నుండి ఆర్ధికంగా చెప్పుకోదగిన సహకారం అందించడం లేదు.
లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించడంతో జీఎస్టీతోపాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్), స్టాంపుల అమ్మకాలు, స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది.
దానితో వివిధ ప్రభుత్వ శాఖల పేరిట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. శాఖలకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల డిపాజిట్లకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా ఆయా శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుమారు రూ 2,000 కోట్ల మేరకు ఉన్నట్లు తేలింది.
మరోవంక, రాష్ట్రం చెల్లించాల్సిన అన్ని రకాల రుణాల చెల్లింపు ప్రక్రియను వాయిదా వేసే విధంగా చర్యల్ని తీసుకోవాలని ఆర్‌బిఐని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ ప్రభావం వచ్చే 6 నెలల పాటు ఉండే అవకాశం ఉన్నందున రుణాల చెల్లింపు వాయిదాకు అనుమతిని ఇవ్వాలని ఆర్బీఐని కోరే అవకాశం ఉంది.