
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. అమాయక పౌరులే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదుల దుశ్చర్యలను అందరు ఖండిస్తున్నారు. బిహార్ కు చెందిన అరవింద్ కుమార్ షా (30) శ్రీనగర్ ఈద్గా వద్ద ఉగ్రవాది తుపాకీ కాల్పులకు చనిపోయాడు. మరో ఘటనలో పుల్వామా జిల్లాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సంఘీర్ అహ్మద్ ను సైతం ఉగ్రవాదులు హత్య చేయడం సంచలనం సృష్టించింది. గత రెండు వారాల్లో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన పౌరుల సంఖ్య తొమ్మిదికి చేరడం గమనార్హం.
కశ్మీర్ లో ఉగ్రవాదుల అలజడి పెరుగుతోంది. నార్ ఖాస్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో జేసీవో సహా ఇద్దరరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లో తొమ్మిది మంది సైనికులు చనిపోయారు. ఇందులో ఇద్దరు జేసీవోలు ఉన్నట్లు తెలుస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ జరుగుతోంది. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందడం ఆందోళనకరం.
కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో సైన్యం కూడా సరైన రీతిలో స్పందిస్తోంది. గురువారం సాయంత్రం బలగాలు గాలింపు చేపట్టారు. ఇటీవల పూంజ్ జిల్లాలో ఐదుగురు ఆర్మీ సిబ్బందిని హత్య చేసిన ముష్కరులే ఈ ఎన్ కౌంటర్లో పాల్గొని ఉండవచ్చని తెలుస్తోంది. పుల్వామా, శ్రీనగర్ లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమర్చాయి. పుల్వామాలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో బలగాలు గాలింపు చేపట్టాయి.
శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో మర ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ట్వీట్ చేస్తూ మన సహచరులైన ఇద్దరు పోలీసులను గతంలో చంపిన ఉగ్రవాది ఉమర్ శనివారం ఎన్ కౌంటర్లో చనిపోయాడు. అతడితో పాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.