Nagaland: ఈశాన్య రాష్ర్టం నాగాలాండ్ మరోమారు దద్దరిల్లింది. కాల్పులతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భద్రతా బలగాల అనుమానంతో సామాన్య పౌరులకు తీవ్ర నష్టం జరిగింది. ఏకంగా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. దీంతో స్థానికులు సైన్యంపై రాళ్లు రువ్వి వాహనాలు తగులబెట్టారు. కోపోద్రిక్తులై నానా హంగామా సృష్టించారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం నెఫియు రియో ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపించి నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పారు. కానీ శాంతిభద్రతలకు మాత్రం విఘాతం కలుగుతోంది.
నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని థిరు, ఒటింగ్ గ్రామాల్లో శనివారం అర్థరాత్రి బొగ్గుగనుల్లో పనిచేసే యువకులు మినీ ట్రక్కులో వస్తుండగా మిలిటెంట్లని భావించి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. గ్రామీణులు వాహనాలను తగులబెట్టారు.

Also Read: విశాఖకు పొంచివున్న మరో గండం..!
దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ, ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని శాంతంగా ఉండాలని కోరారు. కానీ ప్రజలు మాత్రం శాంతించడం లేదు. తమకు జరిగిన అన్యాయంపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది అవగాహన లోపం వల్ల తలెత్తిన సమస్యపై ఎవరు సమాధానం చెబుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై హోంమంత్రి అమిత్ షా సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమని చెప్పారు ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతటి దారుణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంతకీ ఈ సంఘటన చోటుచేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
Also Read: ప్రధాని మోదీ రహస్యాలు బయటపెట్టిన నడ్డా..