https://oktelugu.com/

Farmers’ Agitation : ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్

మరోవైపు హర్యానా రాష్ట్రానికి చెందిన రైతు సంఘాలు నిరసనలో పాల్గొనేది లేదని పోలీసు అధికారులకు హామీ ఇచ్చాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 11:14 pm
    Follow us on

    Farmers’ Agitation : రెండు సంవత్సరాల క్రితం కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై కొందరు రైతులు చేసిన నిరసన గుర్తుకుందా.. నెలల పాటు సాగిన ఆ నిరసనలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు అట్టుడికి పోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. అదే సందర్భంలో వచ్చిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆ సాగు చట్టాల జోలికి కేంద్రం వెళ్లలేదు. అయితే అప్పట్లో ఈ చట్టాలకు సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి విపక్షాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మా చెవుల్లో జోరీగల్లాగా ఇబ్బంది పెట్టే ప్రతిపక్షాలు ఉండకూడదనేదే మా ఉద్దేశమని” అన్నారు. ఆయన అన్నట్టుగానే ప్రస్తుత ఎన్డీఏ కూటమిలోకి అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం విశేషం.

    రైతు సంఘాలు కవాతు పేరుతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ తర్వాత ఆర్ ఏ ఎఫ్, మూడవ అంచెలో హర్యానా సాయుధ బలగాలను పోలీసులు మోహరించారు. అంతేకాదు పంజాబ్ తో సరిహద్దును మూసేశారు. లింకు రోడ్డులోనూ పోలీస్ సిబ్బందిని తరలించారు. తనిఖీల అనంతరమే 13న వాహనాలను హర్యానాలోకి అనుమతిస్తారు.

    రైతు సంఘాల కవాతు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 15 జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ట్రాక్టర్ల తో నిర్వహించే ర్యాలీని నిషేధించారు. ఇక ప్రస్తుత పరిణామాలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హర్యానా సీఎంవోకు పంపుతున్నది. సోషల్ మీడియాలో జరుగుతున్న సమాచార వ్యాప్తి పై కూడా దృష్టి సారించింది. ఉద్రిక్తతలకు దారి తీసే సమాచారాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. వెరిఫికేషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తే వారిపై తీవ్ర చర్యలకు వెనుకాడబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు ఇప్పటికే పారిశ్రామిక సంస్థల అధిపతులు పోలీసులను కలిశారు. గతంలో జరిగిన నిరసనలు తమ తీవ్రంగా నష్టపోయామని.. ఈసారి అలా జరగకుండా చూడాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. మరోవైపు హర్యానా రాష్ట్రానికి చెందిన రైతు సంఘాలు నిరసనలో పాల్గొనేది లేదని పోలీసు అధికారులకు హామీ ఇచ్చాయి. ట్రాక్టర్ ట్రాలీలు పొలాల్లో దున్నడానికి తప్ప ఎలాంటి ప్రదర్శన కోసం కాదని హర్యానా డిజిపి శత్రు జీత్ కపూర్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. పారా మిలిటరీ బలగాలు కూడా సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించడంతో హర్యానా రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది.