UP Elections: పార్లమెంటు ఎన్నికల్లో నేతలు దేశంలోని ఏ లోక్‌సభ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చు. ఈమేరకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ క్రమంలోనే గతంలో ప్రధానులు ఇందిరాగాంధీ మెదక్ నుంచి పీవీ నర్సింహారావు నంద్యాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక మన తెలుగు వాళ్లు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం అరుదు. అప్పట్లో సినీనటి జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు తెలంగాణకు చెందిన ఓ మహిళ ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్‌సభ బరిలో దిగింది. బీఎస్పీ తరఫున పోటీ చేస్తోంది. ఆమె ఎవరు.. బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
నల్గొండ జిల్లా మహిళ..
ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్‌సింగ్ మూడో భార్య. స్థానికంగా రాజకీయంగా మంచి పట్టు ఉన్న ధనుంజయ్‌సింగ్‌కు కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయారు. దీంతో తాజాగా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డిని పోటీకి దించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆమెకు టికెట్ ఇచ్చా. దీంతో జౌన్‌పూర్‌లో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ తరఫున కృపాశంకర్‌సింగ్, ఎస్పీ తరఫున బాబూసింగ్ కుశ్వాహా బరిలో ఉన్నారు.
శ్రీకళారెడ్డి కుటుంబ నేపథ్యం ఇదీ..
శ్రీకళారెడ్డి తండ్రి కె.జితేందర్‌రెడ్డి. నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచ్‌గా సేవలందించారు. నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పచేస్తుంది. దీంతో శ్రీకళారెడ్డి బాల్యం అక్కడే గడిచింది. ఇంటర్మీడియెట్ చెన్నైలో పూర్తిచేయగా, డిగ్రీ హైదరాబాద్‌లో చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికా వెళ్లిన శ్రీకళారెడ్డి అక్కడ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలు చూసుకున్నారు.
ధనుంజయ్‌సింగ్‌తో వివాహం..
యూపీకి చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్‌సింగ్ మొదటి భార్య చనిపోయింది. రెండో భార్య విడాకులు తీసుకుంది. దీంతో శ్రీకళారెడ్డిని మూడో భార్యగా 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్యారిస్‌లో పెళ్లి చేసుకుని చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఐదేళ్ల క్రితం శ్రీకళారెడ్డి జేపీ.నడ్డా సమక్షంలో తెలంగాణలో బీజేపీలో చేరారు. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే 2021లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీసీగా శ్రీకళారెడ్డి విజయం సాధించింది. స్రస్తుతం జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ టికెట్ ఇవ్వడంతో ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2009లో ధనుంజయ్‌సింగ్, 2019లో బీఎస్పీ, ఎస్పీ కూటమి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి మాయవతి శ్రీకళారెడ్డికి టికెట ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఎంటరిగా పోటీ చేస్తోంది.
ఆస్తులు ఇవీ..
ఇక శ్రీకళారెడ్డి ఆస్తుల విషయానికి వస్తే ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆమె భర్త ధనుంజయ్ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, 5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.