Telangana: తెలంగాణ ఎలా వచ్చింది అనే అంశం చర్చకు వస్తే.. టీఆర్ ఎస్ బల్లగుద్ది మరీ కేసీఆర్ వల్లే వచ్చిందని చెబుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా తామే ఇచ్చామని చెప్పుకుంటుంది. మరి ఈ విషయంలో బీజేపీ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఎలా..? మాటల మాంత్రికుడు అయిన మోడీ ఈ బాధ్యతను తీసుకున్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసి టీఆర్ ఎస్‌కు షాక్ ఇచ్చారు.
తెలంగాణను కాంగ్రెస్ తన స్వార్థం కోసమే ఇచ్చిందని వెల్లడించారు. అదే సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, కానీ ఆంధ్రా విభజన మాత్రం సరైన పద్ధతిలో జరగలేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్వార్థం కోసం రెండు రాష్ట్రాల నడుమ వివాదాలు లేపిందని, అందుకే రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించారు.
అయితే మోడీ ఇలాంటి కామెంట్ చేయడంతో అంతా షాక్ అయిపోతున్నారు. ఆయన మాటలను బట్టి కాంగ్రెస్ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ తేలేదని చెప్పుతున్నారా అని అంటున్నారు విశ్లేషకులు. ఇన్ డైరెక్టుగా కేసీఆర్‌ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. క్రెడిట్ మొత్తం ఇన్ని రోజులు కేసీఆర్ తీసుకున్నారని.. అసలు విభజన అంశం తెరమీదకు వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కడే తేలేదనే అంశం తెరమీదకు రావాలని మోడీ ఇలాంటి కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది.
అయితే క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ ఖాతాలో పడకుండా జాగ్రత్త పడ్డారు. అటు ఏపీకి అన్యాయం చేసిందని చెప్పేశారు. విభజన సరైన పద్ధతిలో చేయలేదని చెప్తూ.. కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చారు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరిగా.. అటు టీఆర్ ఎస్‌ను, ఇటు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు మోడీ. ఇన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ గెలుస్తూ వస్తున్నారు.
Also Read: చంద్రబాబు మదిలో కొత్త వ్యూహం.. పదును పెడితే జగన్‌కు ఇరకాటమే..!
ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన దీన్ని బాగానే వాడుతున్నారు. కాబట్టి ఈసారి అలా జరగొద్దన్నది బీజేపీ ప్లాన్. అసలు విభజన అంశాలపై మరోసారి చర్చ జరగాలని, అప్పుడు కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదనే అంశం ప్రజలకు వివరించాలన్నది బీజేపీ ప్లాన్. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారని, తెలంగాణ తమ వల్లే వచ్చిందని ప్రచారం చేసుకునే అవకాశం లేకపోలేదు. కానీ మోడీ టార్గెట్ కేసీఆర్. సెంటిమెంట్ ఓట్లను చీల్చే క్రమంలోనే ఇలాంటి కామెంట్లు చేసినట్టు సమాచారం.
Also Read: తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మంటపెట్టిన మోడీ