కరోనావైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా దేశం వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, 14 గంటల పాటు మాత్రమే జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వగా, తెలంగాణలో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు 24 గంటలపాటు అమలు జరపాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు సూచించారు.
వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని, మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోతాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
షాపులు, మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాలని కేసీఆర్ కోరారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, పాలు, కూరగాయలు, పండు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి ఇందులోనుండి మినహాయింపు ఉందని చెప్పారు.
రెండురోజుల తర్వాత మహారాష్ట్ర సరిహద్దును మూసివేసే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టామని పేర్కొంటూ 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 8 మంది జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లు పని చేస్తున్నాయని వివరించారు.
మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని చెబుతూ 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. 700 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారని, ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారే అని తెలిపారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెబుతూ విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. “జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం. ఇది మీ సామాజిక బాధ్యతగా గుర్తించాలి” అని విజ్ఞప్తి చేశారు.