Pawan Kalyan BJP Alliance: తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో ఎన్నో చిక్కుముళ్ళు వీడనున్నాయి. అక్కడ గెలుపోటములతోనే.. ఏపీలో రాజకీయ పార్టీలు పావులు కదిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే ఒకలా.. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరోలా ఏపీలో రాజకీయ వ్యవహారాలు నడవనున్నాయి. ఈ విషయంలోబిజెపి ఒక వ్యూహంతో ఉండగా.. దానిని చిత్తు చేస్తూ చంద్రబాబు మరో ప్లాన్ తోముందుకు సాగుతున్నారు. ఇందులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మాత్రం పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు.దీంతో పొలిటికల్ హిట్ నెలకొని ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. ఎటువంటి అధికారిక ప్రకటన చేయకున్నా.. టిడిపి శ్రేణులు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది చంద్రబాబు వ్యూహమా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం.. చంద్రబాబు పరపతి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఓడి.. బిజెపి గౌరవప్రదమైన స్థానాలు తగ్గించుకుని.. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుపై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జనసేన ద్వారా బిజెపి పట్టు బిగించే పరిస్థితి ఉంటుంది.
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ న్యూట్రల్ గా ఉండాలని నిర్ణయం తీసుకుందో..అప్పుడే బిజెపి వ్యూహాత్మకంగా జనసేనను తన వైపు తిప్పుకుంది. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ అవసరం తమకు లేదని భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా చెప్పుకుని వస్తోంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంది. దీని వెనుక ఏపీలో వ్యూహం ఉందని తెలుస్తోంది. పలుమార్లు తనకు రూట్ మ్యాప్ ఇవ్వలేదని చెప్పుకొచ్చిన పవన్.. చివరకు బిజెపి రూట్లోకి వచ్చారు. అంటే రూట్ మ్యాప్ ఇచ్చినట్టే కదా. తెలుగుదేశం పార్టీని ఒకవైపు ఆకట్టుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే ఆ పార్టీతో పొత్తును ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులకు సైతం ఒక ఆశాదీపంలా మారిపోయారు. ఇది పక్కాగా బిజెపి స్కెచ్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపికి తెలియకుండానే ఒత్తిడి పెంచడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో సైతం అదే స్ట్రాటజీతో బిజెపి ముందుకు సాగుతోంది. బిసి, మాదిగ నినాదంతో తెలంగాణలో ముద్ర చూపాలని చూస్తోంది. అక్కడ కానీ వర్క్ అవుట్ అయితే ఏపీలో సైతం అదే తరహా విధానం అనుసరించాలని భావిస్తోంది.
తెలంగాణలో బిజెపి, జనసేన కూటమికి ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ఓటమి చవిచూసినా.. ఏపీలో బిజెపి పట్టు బిగించే అవకాశం ఉంది. టిడిపి, జనసేన కూటమి వైపు వచ్చేందుకు మెలిక పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల పరంగా డిమాండ్ తో పాటు పవన్ కు అధికార పీఠంలో షేరింగ్ ఇప్పించేందుకు బిజెపి తప్పకుండా ప్రయత్నిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.