
గతమెంతో ఘనం. తెలంగాణలో ఒకప్పుడు తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. కానీ.. రాష్ట్ర విభజనతో అనివార్యంగా ఆ పార్టీ దెబ్బతిన్నది. వేగంగా పతనమవుతూ వచ్చింది. ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా అవకాశం ఉన్న పార్టీల్లో చేరిపోవడంతో.. ఎన్టీఆర్ భవన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ సైతం గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించకపోవడంతో.. అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
కేడర్ తో చర్చించిన తర్వాతనే.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అటు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో.. సైకిల్ దిగి కారు ఎక్కేందుకు రమణ సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నమే కేసీఆర్ తో సమావేశం కానున్నారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్టు సమాచారం.
అయితే.. టీఆర్ఎస్ పార్టీ రమణకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం.. ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో పలు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక జరగనుంది. శాసనసభ్యుల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేయనున్నారు. ఇందులో ఒక ఎమ్మెల్సీని రమణకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. టీడీపీలో ఇంకా ఎంత కాలం కొనసాగినా.. పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనిపించట్లేదు. దానివల్ల రాజకీయ కాలాన్ని వృధా చేసుకోవడం మినహా.. సాధించేది ఏమీ లేదనే భావనకు వచ్చేస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరుగా సైకిల్ దిగుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే దిగిపోయారు. ఈ పరిణామంతో.. తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు ఎవ్వరూ లేకుండా పోయారు. కార్యకర్తలు ఉన్నా.. నాయకులు లేని పార్టీ.. బహుశా తెలుగుదేశం పార్టీ మాత్రమే కావొచ్చు!