Telangana Politics: తెలంగాణల రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలు ముమ్మరంగా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిన్నటి నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుుతున్నారు. ఈ యాత్ర మే 14 వరకు కొనసాగనుంది. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని బండి పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా పోరుబాట పట్టింది. కాంగ్రెస్ శాసనపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఖమ్మంలో పాదయాత్ర చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఎండగడుతూ పాదయాత్ర చేపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమైప్పటి నుంచి నేతల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజల్లో చులకన అయిపోవడంతో ఇక దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని పోరుబాట పట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి గాను మే 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన రాష్ట్రంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు
Also Read: Karnataka Minister Eshwarappa : కర్ణాటక అవినీతి కంపు బీజేపీని దహించేస్తోందా?
నిండు వేసవిలో పార్టీలో యాత్రల పేరుతో పండగ చేసుకుంటున్నాయి. అదికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతూ కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమని చెబుతున్నారు. దీంతో యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం.
టీఆర్ఎస్ కూడా బీజేపీపై దుమ్మెత్తి పోస్తోంది. ధాన్యం కొనుగోలులో కేంద్రం రాష్ట్రంపై భారం మోపుతోందని విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేసి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించినా కేంద్రం ససేమిరా అనడంతో రాష్ట్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీని నిందిస్తూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
దీంతో రాష్ట్రంలో అప్పుడే రాజకీయ సందడి షురూ అయిందని తెలుస్తోంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తమకు అనుకూల పవనాలు వచ్చేలా ప్రయత్నిస్తున్నాయి.