YS Sharmila: తోడ బుట్టిన అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల కాలికి బలపం కట్టుకుని ఏపీ అంతా తిరిగింది. 2019లో ఏపీలో ఫ్యాన్ గాలి వీయడంలో తన వంతు పాత్ర పోషించింది. మూడేళ్లు గడిచినా ఆమెకు పార్టీ నుంచి ఏమీ దక్కలేదు. అన్నను కలిసినా ఉపయోగం లేకపోయింది. పైగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు అంతకంతకు మూసుకుపోతుండటంతో గత్యంతరం లేక బయటకు వచ్చింది. 2009 లో నంద్యాల ఎన్నికల సభలో ఏ ప్రాంతానికి వెళ్లాలంటే వీసా కావాలని వాళ్ల నాన్న అన్నాడో ఆ ప్రాంతమే మళ్లీ ఆమెకు దిక్కయింది. ఇన్నాళ్లు అక్కరకు రాని తెలంగాణలోని అత్తింటి ఇల్లు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇంకేముంది పొలిటికల్ డ్రామా స్టార్ట్ చేసింది. అన్న జైల్లో ఉన్నప్పుడు ఉపయోగ పడిన పాదయాత్ర మళ్ళి మొదలైంది. ఈసారి మహాప్రస్థానం పేరుతో తెలంగాణ మొత్తం చుట్టి వచ్చేందుకు ప్రణాళిక ఖరారు అయింది.
సెంటిమెంటే అస్త్రంగా
ముదిగొండ కాల్పుల్లో ఏడుగురుని పొట్టన పెట్టుకున్నప్పటికీ.. ఔటర్ రింగ్రోడ్ నిర్మాణంలో అడ్డగోలుగా భూములు దోచుకున్నప్పటికీ.. బయ్యారం ఇనుప నిజాన్ని అడ్డగోలుగా దోచుకున్నప్పటికీ.. తెలంగాణ పై “సీమ” పెత్తనం చలాయించినప్పటికీ.. అన్ని కుట్రలను చేదించుకుని లంగాణ ఏర్పడినప్పటికీ… ఇప్పటికీ ఈ ప్రాంతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అభిమానులు ఉన్నారు. అభిమానాన్ని చంపుకోలేక ఊరూరా విగ్రహాలు కూడా పెట్టారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పఠించిన సంక్షేమ మంత్రం వల్ల బాగుపడ్డ కుటుంబాల వివరాలు, ఓదార్పు యాత్ర వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు.. అన్నీ కూడా షర్మిల కు తెలుసు కనుక ప్రజాప్రస్థానం యాత్ర ఇక్కడ మొదలుపెట్టారు. వాళ్ళ నాయిన వాడిన బూట్లు, ధరించిన వాచితో, చేవెళ్ల సెంటిమెంట్తో జనం ముందుకు వచ్చారు. భారీ హంగామా తోనే జనంతో నడుస్తున్నారు.
Also Read: Menu For Modi: మోడీకి వంట చేస్తున్న కరీంనగర్ మహిళ యాదమ్మ మాటలు వైరల్
జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే దానికంటే అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. మొన్నటిదాకా ఆంధ్రాలో ఉండి, అన్నతో జరిగిన గొడవల వల్ల తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. పైగా ఆంధ్రాలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు, అరాచకాలు కళ్ళముందు కనిపిస్తున్నా వాటిని దాచిపెట్టి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం వైఎస్ షర్మిల మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం. భర్త బ్రదర్ అనిల్ అని తానై ఉండి ఈ యాత్రను నడిపిస్తున్నారు. స్వతహాగా ఏసుక్రీస్తు మత ప్రబోధకుడు కావడం, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేఏ పాల్ ను తొక్కి ఈయనను లేపడంతో పరిచయాలు బాగానే పెంచుకున్నాడు. నాటి పరిచయాలు, విదేశీ నిధులతో కూడబెట్టిన ఆస్తులను షర్మిల పాదయాత్ర కోసం ఖర్చు చేస్తున్నారు. పాదయాత్ర ముందు భాగంలో ఇతని మతానికి సంబంధించిన వారే ఉంటున్నారు.
మంత్రి అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో
షర్మిల యాత్రను అధికార పార్టీ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. కానీ మొన్న ఖమ్మంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి. దీంతో పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఫలితంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో ఇంతవరకు చెప్పని షర్మిల.. వెంటనే పాలేరు నుంచి తాను రంగంలో దిగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యేగా కందాళ ఉపేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అప్పటి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఉపేంద్ర రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం తో తుమ్మల వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. మరోవైపు ఇటీవల ఖమ్మం పర్యటనకు కేటీఆర్ తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. తుమ్మల ఎలాగు తనకు రాజకీయ శత్రువు కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ కావాలనే షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేసి పాలేరు బరిలో ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
స్థాయికి మించిన వ్యాఖ్యలు
పాదయాత్ర సందర్భంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు స్థాయిని దాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కేసీఆర్ ను ఉరితీయాలి, కేటీఆర్ అంటే ఎవరు?, జాగృతి పేరుతో కవిత దోచుకుంది, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి వ్యాఖ్యలతో షర్మిల చులకన అవుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న పాదయాత్ర సందర్భంగా ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఇస్తే డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం వైఎస్ఆర్ టీపీకే వేయాలని ఆమె ప్రజలను కోరుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాదయాత్రకు కోట్లు ఖర్చు చేస్తున్న షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం జనాలకు చిత్రంగా కనిపిస్తోంది. షర్మిల ఒకరోజు పాదయాత్రకు 10 లక్షల దాకా ఖర్చు చేస్తున్నట్టు వినికిడి. జనం బాగా కనిపించాలి కాబట్టి బ్రదర్ అనిల్ మతస్తుల తో పాటు, స్థానికంగా దొరికే వ్యవసాయ కూలీలను కూడా పాదయాత్రలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో కూలీలను షర్మిల పాదయాత్రకు తీసుకెళ్తుంటే తమ పనులు సాగడం లేదని స్థానిక రైతులు వైఎస్ఆర్టీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. మరికొందరైతే ఎంపీడీవో స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర వల్ల తెలంగాణలో అధికారంలోకి వస్తారో రారో తెలీదు కానీ తమకు మాత్రం చేతి నిండా డబ్బులు దొరుకుతున్నాయని కూలీలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Also Read:ABN RK vs Jagan: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను జైలుకు పంపాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana politics why is sharmila spending money on praja prasthanam padayatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com