Telangana Politics: తెలంగాణలో కేసీఆర్ ను అపర చాణక్యుడిగా చెబుతారు. వ్యూహాలు రచించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యర్థిని గందరగోళంలో పడేయడంలో తనదైన పాత్ర పోషిస్తారు. తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు 14 ఏళ్లు నడిపించి నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఈ నేప్యంలో కేసీఆర్ ఢిల్లీ లో వారం రోజుల పాటు మకాం వేసి బీజేపీ నేతల్లో అంతర్మథనం వచ్చేలా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని పుకార్లు వచ్చేలా చేశారు.
ఇక దళితబంధు విషయంలో కూడా కేసీఆర్ తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకం ప్రారంభించినా మరో నాలుగు మండలాలకు విస్తరించారు. అందులో భట్టి విక్రమార్క నియోజకవర్గం ఉండడంతో ఆయన సమావేశానికి హాజరు కావడం కాంగ్రెస్ లో సంచలనంగా మారుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళితబంధు అంతా మోసం అని విమర్శలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు దళితబంధు సమావేశానికి హాజరు కావడంతో కాంగ్రెస్ నేతల్లోనే మనస్పర్దలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలు ఏమంటున్నా పట్టించుకోని కేసీఆర్ నోటితో కాకుండా చేతలతో సమాధానం చెబుతున్నారు. వారిలో ఆలోచనలు రావడానికి కారణమవుతున్నారు. వారిలో వారికే వైషమ్యాలు సృష్టించే విధంగా చేయడం ఆయనకే చెల్లు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పలు రకాల పుకార్లు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కొరవడిందని తెలుస్తోంది. ఈ విధంగా కేసీఆర్ తన వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థి పార్టీలను గందరగోళంలో పడేస్తున్నారు.
రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లో కేసీఆర్ అభిమానులు ఇంకా ఉన్నారని చర్చ లేపుతోంది. ఆయా పార్టీల ఆధిపత్య పోరాటాలు కొనసాగుతున్నా టీఆర్ఎస్ మాత్రం తనదైన శైలిలో వారిలో కలహాలు చెలరేగే విధంగా చేయడంలో కేసీఆర్ కృతకృత్యులవుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం అంతర్మథనం సాగుతోంది. అసలు కేసీఆర్ వ్యూహమేంటి? ఆయన లక్ష్యం ఎటు వైపు వెళ్తుందనేది ప్రస్తుతం ప్రస్తావనార్హం.