Child Murder : కామాంధుడి కర్కశత్వానికి మరో పసిమొగ్గ రాలిపోయింది.. ముక్కు పచ్చలారని చిట్టితల్లి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది.. మనిషి ముఖం తగిలించుకున్న మృగానికి బలైపోయింది.. ఊహకే ఒళ్లు గగుర్పొడిచే దారుణ చర్యకు.. చిన్నారితల్లి ఎంతగా విలవిల్లాడిపోయిందో! చుట్టూ ఉన్న నరరూప రాక్షసుల నడుమ.. మేక తోలు కప్పుకున్న తోడేళ్ల మధ్య.. పసిబిడ్డలను కడుపులో దాచుకోవాల్సిన అగత్యాన్ని మరోసారి చాటి చెప్పిందీ సైదాబాద్ ఘటన. మరి, బరితెగించే ఉన్మాదుల సంగతేంటి? ఆడ బిడ్డలు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందేనా? ఈ జనారణ్యంలో ఏ మృగం ఏ మాటు నుంచి దాడి చేస్తుందోనని.. నిత్యం వణికిపోతూ బతకాల్సిందేనా? ఈ దారుణాలకు అంతమెప్పుడు? అంత మొందించాల్సింది ఎవరు?? ఎలా చేస్తారు??? సమాధానం లేదన్నట్టుగా సాగిపోతున్న ఈ ప్రశ్నకు.. సమాజం జవాబు వెతకాలిప్పుడు.
హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపించి, దారుణ అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశాడా ఉన్మాది. నిందితుడిగా భావిస్తున్న రాజుకోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు సమస్య ఈ రాజు ఒక్కడే కాదు. ఇలాంటి రాక్షసులు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్ లో ఏదో ఒక సమయంలో ఆ రక్కసుడు నిద్రలేచి, మరో పసిమొగ్గను చిదిమేయవచ్చు. మానప్రాణాలను హరించవచ్చు. సగటు తల్లిదండ్రులను ఈ భయం వెంటాడుతోంది. సైదాబాద్ ఘటన మొదటిది కాదు.. చివరిది కూడా కాకపోవచ్చు. మరి, ఈ దారుణాలను అడ్డుకునేందుకు అధికారం ఉన్న సర్కారు ఏం చేస్తోంది? అయ్యో అని ఆవేదన చెందుతున్న సమాజం ఏం చేస్తోంది?
స్త్రీని పూజిస్తామని చెప్పుకు తిరిగే.. ఈ సమాజంలోనే అత్యంత దారుణంగా హింసిస్తుండడం గుర్తించాల్సిన విషయం. ఈ పరిస్థితి మారాలిప్పుడు. ఆడది అనగానే అణిగి ఉండాల్సినది అని మగాడి మనసులో మెదిలో ఆలోచన అంతం కావాలిప్పుడు. అసలైన మార్పు ఇంటి నుంచే మొదలు కావాలిప్పుడు. పగటిపూట ఆడబిడ్డను ఒంటరిగా బయటకు వెళ్లడానికి అనుమతించాలా వద్దా? అని పదిసార్లు ఆలోచించే పెద్దలు.. మగాడు అర్ధరాత్రి దాకా బలాదూర్ గా ఎందుకు తిరగనిస్తున్నారు? ఆడపిల్లకు సవాలక్ష నీతులు బోధించే తల్లిదండ్రులు.. బూతులు మాట్లాడే కొడుకును కంట్రోల్ చేయరెందుకు? ఇది కావాలిప్పుడు. ఆడ బిడ్డను గౌరవించడం నేర్పాలిప్పుడు. మన సమాజానికి సంస్కారం అవసరమిప్పుడు. సభ్యత మాటల్లోనే కాదు.. చేతల్లో అనివార్యమిప్పుడు. అది ప్రతీ ఇంటి నుంచి మొదలవ్వాల్సిన అవసరముందిప్పుడు.
ప్రభుత్వాలు కూడా పద్ధతిగా వ్యవహరించడం అత్యవసరమైంది. సమాజంలో జరిగే సగం దారుణలకు మత్తు కారణమవుతోందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. మరి, విచ్చల విడిగా ఈ మద్యం దుకాణాలను ప్రభుత్వం నడపడం ఎందుకు? సైదాబాద్ నిందితుడిగా అనుమానిస్తున్న రాజు నిత్యం మద్యం మత్తులోనే తూలుతుంటాడని, ఎక్కపడితే అక్కడ రోడ్డుమీదనే పడిపోతుంటాడని స్థానికులు చెబుతూనే ఉన్నారు. ఆ మత్తులోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ దారుణంలో మద్యం దుకాణపు వాటా ఎంత?
ఒక దుర్మార్గానికి కారణం ప్రత్యక్షంగా ఒక్కరు కావొచ్చు. కానీ.. తరచి చూసినప్పుడు సమాజంలోని ప్రతీ అవలక్షణానికీ అంతో ఇంతో వాటా ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల్లో అర్ధనగ్న దృశ్యాలు మొదలు.. అమ్మాయిలను ఆకర్షణీయ వస్తువుగా చూపించడం వరకు ఎన్నో అంశాలు మెదళ్లలో చెడును నాటుతుంటాయి. వీటి ప్రభావం తక్కువగా తీసిపారేయలేం. అందుకే.. ఆడపిల్లకు జాగ్రత్తలు చెప్పడానికన్నా ముందు మగాడికి బుద్ధినేర్పడం ఇప్పుడు అత్యవసరం. ప్రతి మనిషీ.. ప్రతి వ్యవస్థా.. తనదైన పద్ధతిలో, తనదైన పరిధిలో ఈ విషయమై చిత్తశుద్ధిని ప్రదర్శించినప్పుడే ఆడబిడ్డలకు రక్షణ సాధ్యమవుతుంది. ఇల్లు, బడి, గుడి, బజారు ఎక్కడైనా మహిళలను చూసే విధానం మారాలి. మార్పు అంటే.. ఎక్కడి నుంచో ఊడిపడదు. నువ్వు మారాలి. నీ ఆలోచన మారాలి. అప్పుడు ఆటోమేటిగ్గా.. సమాజం మొత్తం మారుతుంది. ఇది జరగనంత వరకు.. ఎన్నో సింధూరాలు రాలిపోతూనే ఉంటాయి. అభాగ్యుల మాన ప్రాణాలు అన్యాయంగా గాళ్లో కలిసిపోతూనే ఉంటాయి. తప్పు జరిగిపోయిన తర్వాత చికిత్సకు వీళ్లేని ఈ సమస్యకు.. నివారణే ఇప్పుడు కావాల్సింది. అది నీ నుంచే మొదలు కావాల్సి ఉంది.