Telangana Politics : స్మశానం ముందు ముగ్గు ఉండదు.. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు. అని అప్పట్లో వచ్చిన కలెక్టర్ గారు అనే సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన పరిణామాలు కూడా ఇలానే అనిపించాయి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ తిరిగి చేరారు. అంతేకాదు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన మాట్లాడారు. పార్టీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. చేరికల కమిటీకి జానా రెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ ఆయనకు నామమాత్రంగా అయినా సమాచారం ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం.. అధిష్టానానికి పార్టీపై ఉన్న పట్టును సూచిస్తున్నది. దీనిపై రేవంత్ రెడ్డి నోరు మెదపకపోయినప్పటికీ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పార్టీలోకి ఎవరూ వచ్చినా చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో తిరిగి చేరడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పలు విధాలుగా స్పందనలు వినిపిస్తున్నాయి. ” మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించడం రాజగోపాల్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు. అందుకే బయటకు వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. సరిగ్గా ఏడాది కాకముందే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తున్నారు. ఇప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇలాంటప్పుడు మునుగోడు ఓటర్లకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు” అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి, భారత రాష్ట్ర సమితికి నెక్ టు నెక్ పైట్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు ప్రతి బంధకంగా మారుతాయని వారు అంటున్నారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో అటు వారు ఇటు వారు అటు మారడం సర్వసాధారణం.. అలాంటప్పుడు కార్యకర్తలు రెచ్చిపోవద్దని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరిగినప్పుడు రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతం కూడా ఈ ఎన్నికలప్పుడు చోటు చేసుకున్నదే. దీనిని భారత రాష్ట్ర సమితి తనకు అనుకూలంగా మార్చుకుంది. పైగా ఆ ఎన్నికల సమయంలో గాయి గాయి చేసింది. ఆ కేసులో పస లేకపోవడంతో తర్వాత కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది. కెసిఆర్ కోరుకున్నది ఇదే కాబట్టి ఇప్పుడు ఆ కేసు మీద పెద్దగా చడీచప్పుడూ లేదు. తన రాజీనామా సందర్భంగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని, అందుకే పార్టీని వీడుతున్నానని ఆయన ప్రకటించారు. వాస్తవానికి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు చాలామంది ఆయనతోపాటు కండువా మార్చుకున్నారు.
ఇప్పుడు అకస్మాత్తుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారు అంతర్మథనంలో పడ్డారు. ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారు. “మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించాం. భారత రాష్ట్ర సమితిని కూడా విమర్శించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నమ్ముకున్న నాయకుడు కండువా మార్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లాలి” అని కింది స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో కండువాలు పారేయకుండ్రీ.. ఏ అవసరం ఎట్లొస్తదో శిల్కొయ్యకు ఏశీ పెట్టుకోండ్రీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. రాజకీయాలు అంటే అవసరాలు మాత్రమే అని వారు గుర్తు చేస్తున్నారు.