కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటి సమావేశానికి తెలంగాణ గైర్హాజరైంది. దీంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నదుల యాజమాన్యాల బోర్డుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. కానీ తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.
సమావేశానికి వచ్చిన ఏపీ ఉన్నతాధికారులు తమ వాణిని వినిపించారు. కొద్ది రోజుల్లో మరిన్ని వివరాలతో సమావేశం ముందు ఉంచుతామని చెప్పారు. బోర్డుల సంయుక్త సమావేశంలో పెద్దగా సంచలనం కలిగించే విషయాలు ఉండవని తెలిసినా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడనికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోవడంపై రెండు స్టేట్లకు మాత్రం లాభం జరగలేదని స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ ఇదివరకే కేంద్రానికి తెలిపింది. గెజిట్ లో కూడా తప్పులున్నాయని చెప్పింది. తెలంగాణ కూడా గెజిట్ పై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో రెండు ప్రభుత్వాల సమాచారం తీసుకున్నాకే రెండు బోర్డుల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొని తమ అభ్యంతరాలు చెప్పాల్సిన తెలంగాణ ఎందుకు హాజరు కావడం లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమావేశం విజయవాడలోనో, విశాఖలోనో అయితే హాజరు కాకపోవడంలో అర్థం ఉంటుంది కానీ హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ అధికారులు ఎందుకు హాజరు కాలేదో తెలియడం లేదు.
ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తోందని విమర్శలు చేశారు కానీ సమావేశానికి హాజరై ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారని తెలుస్తోంది. దాదాగిరి చేస్తున్నదెవరో తెలిసిపోతుందనే కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకుని సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కోర్టులోనే తేల్చుకుంటామని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో తెలియడం లేదు.