తెలంగాణలో ఎన్నికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా ఎన్నికలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లో రెండు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారం నేటితో ముగియనుంది. మైకులు మూగబోనున్నాయి. ఇక ఈ ఎన్నిక ముగియడంతోనే వెంటనే మినీ మున్సిపల్ సమరానికి తెరలేవనుంది. రెండు కార్పొరేషన్లతోపాటు పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. దీంతో బల్దియాల్లో మరోమారి ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది. ప్రచారం షురూ కానుంది. ఇప్పటికే అక్కడ కీలక నేతలు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మకాం వేశారు.
ఇక.. ఓ వైపు సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంటే ఇప్పటికే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేషన్లను చుట్టేస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారు. తరచూ అక్కడికి వెళ్తూ కార్పొరేషన్లలో ఏం చేయబోతున్నామో హామీలిస్తూ వస్తున్నారు.
ఎలాగైనా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ముందుకెళ్తోంది. ఆయా జిల్లాల్లోని మంత్రులు కూడా ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ కూడా రావడంతో ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు. సాగర్ ఫలితాలు వచ్చే సమయానికే ఒకట్రెండు రోజులు అటుఇటుగా మున్సిపల్ ఫలితాలు కూడా రావాలని చూస్తోంది. నిన్నటి హాలియా సభలో కాంగ్రెస్‌నే టార్గెట్ చేసిన కేసీఆర్.. బీజేపీ ప్రస్తావన ఏమాత్రం తేలేదు. ఇక ఇదే వ్యూహాన్ని వచ్చే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అమలు చేయాలని చూస్తున్నారట. అనవసరంగా బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చి ఆపార్టీకి హైప్ తీసుకురావద్దని కార్యకర్తలకు సైతం సూచిస్తున్నట్లు సమాచారం.