రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. మొత్తం ఐదు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు గత నెల 30న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ పూర్తి ఫలితాలు వెల్లడైన నాలుగు మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగరడం విశేషం.
జడ్చర్లః ఈ మునిసిపాలిటీలో మొత్తం 27 వార్డులకు గానూ టీఆర్ఎస్ 23 స్థానాలను దక్కించుకొని విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. దీంతో.. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి.
అచ్చంపేటః ఇక్కడ కూడా టీఆర్ఎస్ జయకేతనం ఎగరేసింది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. టీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలిచి మునిసిపల్ పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి.
నకిరేకల్ః ఈ మునిసిపాలిటీని కూడా గులాబీ పార్టీనే సొంతం చేసుకుంది. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా.. 11 వార్డులను గులాబీ దళం సొంతం చేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు చోట్ల గెలుపొందాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
కొత్తూరుః రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు మునిసిపాలిటీని సైతం టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా.. 7 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. హస్తం పార్టీ 5 వార్డులను కైవసం చేసుకుంది.
మిగిలిని సిద్ధిపేట మునిసిపాలిటీ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 43 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 21 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ 19 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ ఒకస్థానం, ఇతరులు మరోస్థానం దక్కించుకున్నారు.
అటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. మొత్తం 66 డివిజన్లు ఉన్న వరంగల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు 39 డివిజన్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో టీఆర్ఎస్ 24 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 9, కాంగ్రెస్ 4, ఇతరులు రెండు చోట్ల గెలిచారు. ఇక, 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్లో ఇప్పటి వరకు 31 డివిజన్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో టీఆర్ఎస్ కూటమి 22 చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ కూటమి 7 స్థానాలు, బీజేపీ కూటమి ఒక స్థానం, ఇతరులు ఒకస్థానం దక్కించుకున్నారు.