
KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ.. అనతి కాలంలోనే తానేంటో నిరూపించుకున్నారు. విషయ పరిజ్ఞానంతోపాటు చక్కటి వాగ్ధాటి కేటీఆర్ ను ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే.. ఈ మధ్య ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతోపాటు వ్యక్తిగతంగా కేటీఆర్ నడవడిక కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజా సంఘటనే ఇందుకు ఉదాహరణ. వర్షానికి తడుస్తున్న కార్పొరేట్ కు గొడుగెత్తిన తీరుపై ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి.
మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన టెక్ మహీంద్రా హైదరాబాద్ లో ఒక ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఈ సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. దీంతో.. వెంటనే కేటీఆర్ గొడుగు బయటకు తీశారు. టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీపై చినుకులు పడకుండా గొడుగు పట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేటీఆర్ వ్యవహార శైలిని అందరూ ప్రశంసిస్తున్నారు. మంత్రి అనే హంగూ ఆర్భాటాలు ఎక్కడా ప్రదర్శించకుండా కేటీఆర్ గొడుగు పట్టిన తీరును అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్నానీ కూడా కేటీఆర్ గొప్పతనాన్ని ప్రశంసించారు. అటు మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ విషయమై స్పందించారు. నాయకత్వం, వినయం విడదీయరానివని కేటీఆర్ నిరూపిస్తున్నారు అని అన్నారు ఆనంద్ మహీంద్ర. ఇందుకు గానూ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆ మధ్య కేరళ నుంచి వచ్చిన కార్పొరేట్ ప్రతినిధులను కూడా ఇదేవిధంగా ఆకర్షించారు కేటీఆర్. వారి కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు చేయించి, వరంగల్ టెక్స్ టైల్ పార్కును సందర్శించేలా చేశారు. అనంతరం తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేలా చూశారు. ఇప్పుడు విజయ్ రూపానీకి గొడుగు పట్టిన తీరు కార్పొరేట్ ప్రపంచాన్ని ఆకర్శించింది. తద్వారా.. భవిష్యత్ లో మరిన్ని పెట్టుబడులుకూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి.. రూపానీపై చినుకు పడకుండా చూసిన కేటీఆర్ పై ప్రశంసల వర్షమే కురుస్తోంది.