
‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ డబ్బులు వృథా చేయొద్దు.. సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. వికలాంగులకు ట్రై స్కూటర్లను పంపిణీ చేద్దాం. నా వంతుగా వంద స్కూటర్లను ఇస్తున్నాను. మీరు కూడా ఇదేవిధంగా చేయండి’’ అంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచించారు కేటీఆర్. పలువురు నేతలు కూడా అలాగేని తలూపారు. కానీ.. బర్త్ డే రోజుకు పరిస్థితి మొత్తం మారిపోయింది.
వార్తా పత్రికల్లో జాకెడ్ యాడ్స్ వచ్చేశాయి. టీవీ ఛానళ్లలో ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ఇక, బ్యానర్లు, కేకులు కోయడాలకు అంతే లేదు. మొత్తంగా.. కేటీఆర్ బర్త్ డేను గులాబీ పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు నేతలు. అయితే.. ఈ పరిస్థితి గతంలో ఉన్నా.. ఇంతలా మాత్రం లేదు. మరి, ఎందుకు ఈ స్థాయిలో వేడుకలు చేస్తున్నారు? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. కేటీఆర్ ఇప్పుడే.. వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారా? అంటే అదీ లేదు. మంత్రి కూడా ఎప్పుడో అయ్యారు. మరి, రీజన్ ఏంటన్నప్పుడు ఆ ఒక్క కారణమే కనిపిస్తోంది.
కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనే చర్చ గత కొంత కాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇక, సీటు మీద కూర్చోవడమే తరువాయి అన్నట్టుగా వాతావరణం మార్చేశారు. అయితే.. దుబ్బాకలో దెబ్బ తగలడం.. జీహెచ్ఎంసీలో లెక్కలు మారిపోవడంతో కేసీఆర్ వెనకడుగు వేశారనే ప్రచారం జరిగింది.
అయితే.. ఇప్పుడు మళ్లీ సానుకూల వాతావరణం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం, నాగార్జున సాగర్లోనూ గులాబీ జెండా ఎగరడంతో.. మళ్లీ కారు టాప్ గేరులోకి వచ్చేసిందనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. యువ నేతకు పట్టాభిషేకం జరిపే అవకాశం అతి త్వరలోనే ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ కారణంగానే.. ఈ పుట్టిన రోజు సంబరాలను అంబరాన్నంటేలా జరుపుతున్నారని సమాచారం. రామోజీరావు వంటి మీడియా దిగ్గజాలు కూడా.. కేటీఆర్ గొప్ప పదవులు అలంకరించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతుండడం గమనించాల్సిన అంశంగా చెబుతున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంత? ఆ ముహూర్తం ఎప్పుడు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.