ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టబోతున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు ఇచ్చింది. శనివారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఈ నోటీసు అందజేసింది. ఈ మేరకు ఆదివారం నుంచే నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీకి హాజరయ్యారు జూడాలు.
కరోనా డ్యూటీలో పాల్గొంటున్న జూనియర్ డాక్టర్లకు ప్రాణాపాయం సంభవిస్తే కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారు కోరుతున్నారు. నర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా.. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10 శాతం కరోనా అలవెన్స్ ను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే తాము కూడా 26వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ల అసోసియేషన్ కూడా సమ్మె నోటీసు ఇచ్చింది.
ఇటీవల సీఎం గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమ డిమాండ్లను విన్నవించామని, దానికి త్వరలోనే చర్చలకు పిలుస్తామని సీఎం చెప్పారని అన్నారు. కానీ.. ఇప్పటి వరకూ తమకు పిలుపురాలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు, సీనియర్ వైద్యులు కోరుతున్నారు. మరి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.